ఎలక్ట్రిక్ వాహనాల నూతన విధానాన్ని ప్రకటించిన తెలంగాణ
వచ్చే పదేళ్లపాటు అమల్లోకి నూతన విధానం

హైదరాబాద్: ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కలిసి రాష్ర్ట ప్రభుత్వం రూపొందించిన నూతన ఎలక్ర్టిక్ వెహికిల్ (ఈవీ) పాలసీని శుక్రవారం ఉదయం విడుదల చేశారు. జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో తెలంగాణ ఈవీ సమ్మిట్‌లో పాలసీ విధానాన్ని ప్రకటించారు. రాష్ర్టాన్ని ఎలక్ర్టిక్ వాహనాల హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ఈ నూతన విధానాన్ని ప్రకటించారు. ఎలక్ర్టిక్ వాహనాలు, ఇంధన నిల్వలకు కొత్త విధానం అమలు చేయనున్నారు. 2020-2030 వరకు ఎలక్ర్టిక్ వాహనాల తయారీ, వినియోగంపై విధానమైన ప్రకటన చేశారు. పాలసీ విడుదల కార్యక్రమంలో నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్, మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్‌కుమార్ గోయెంకా, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, ఎస్ బ్యాంకు చైర్మన్ సునీల్ మెహతా తదితరులు పాల్గొన్నారు.
కాగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. నిన్నటి నుంచి వచ్చే పదేళ్ల వరకు ఈ నూతన విధానం అమల్లో ఉంటుంది. రాష్ట్రంలో పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ది, తయారీ, వాడకాన్ని ప్రోత్సహించడంతోపాటు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ విధానానికి రూపకల్పన చేసింది.
నూతన విధానంలో భాగంగా రాష్ట్రంలో తయారై అమ్ముడుపోయిన తొలి 2 లక్షల ద్విచక్ర వాహనాలు, 20 వేల ఆటోలు, 5 వేల నాలుగు చక్రాల వాహనాలు, 10 వేల తేలికపాటి సరకు రవాణా వాహనాలు, 5 వేల కార్లు, 500 బస్సులకు రిజిస్ట్రేషన్ రుసుము, రోడ్డు ట్యాక్స్ వందకు వందశాతం మినహాయింపు లభిస్తుంది. అలాగే, రాష్ట్రంలో కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ ట్రాక్టర్లకు కూడా ఈ రెండు ఉచితమే.
కనీసం రూ. 200 కోట్లతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీని చేపట్టే భారీ పరిశ్రమలకు రూ. 30 కోట్లకు తగ్గకుండా 20 శాతం పెట్టుబడి రాయితీతోపాటు రూ. 25 కోట్లకు తగ్గకుండా ఏడేళ్లపాటు జీఎస్టీ తిరిగి చెల్లించనున్నారు. అలాగే, ఐదేళ్లపాటు 5 కోట్ల పరిమితితో 25 శాతం విద్యుత్ రాయితీ, రూ. 50 లక్షల పరిమితితో ఐదేళ్లపాటు విద్యుత్ రుసుం పూర్తిగా మినహాయింపు, రూ. 5 కోట్లకు తగ్గకుండా ఐదేళ్లపాటు 60 శాతం రవాణా రుసుం, 5 కోట్లకు తగ్గకుండా 5.25 శాతం వడ్డీ రాయితీ ఇవ్వనుంది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/