పలు అభివృద్ధి పనులకు మంత్రి కెటిఆర్‌ శంకుస్థాపన

TS Minister KTR-
TS Minister KTR-

భువనగిరి: రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కెటిఆర్‌, విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి క‌లిసి భువనగిరి మున్సిపాలిటీ ప‌రిధిలో ప‌లు అభివృద్ధి పనుల‌కు శంకుస్థాప‌న చేశారు. మున్సిపాలిటీ ప‌రిధిలోని డంపింగ్‌ యార్డులో నిర్మించిన మానవ మలవ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆర్‌అండ్‌బీ గెస్టుహౌస్‌ సమీపంలో 14వ, 15వ ఆర్థిక సంఘం, పట్టణ ప్రగతి నిధులు రూ.8.70కోట్ల వ్యయంతో నిర్మించనున్న సమీకృత మార్కెట్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆర్‌అండ్‌బీ వసతిగృహం ఆవరణలో నిర్మించనున్న నిరాశ్రయుల వసతి గృహానికి శంకుస్థాపన చేశారు.

ఐబీ కార్యాలయం ముందు ఎన్‌యూఎల్‌ఎం, పట్టణ ప్రగతి నిధులు రూ.11.50లక్షల వ్యయంతో వీధి వ్యాపారుల కోసం నిర్మించిన 25 దుకాణాలను మంత్రి ప్రారంభించారు. 30, 31, 32, 34వార్డుల్లో రూ.31.50లక్షలతో 197మీటర్ల మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 14వ ఆర్థిక సంఘం, పురపాలక సంఘ సాధారణ నిధులు రూ.1.51కోట్లతో నిర్మించనున్న స్మృతివనం ఆధునిక పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్య‌క్ర‌మాల్లో భువ‌న‌గిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖ‌ర్ రెడ్డి, ఎంపీ బ‌డుగుల లింగ‌య్య యాద‌వ్, ప్ర‌భుత్వ విప్ గొంగిడి సునీత‌‌తో పాటు ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/