పవన్ ఓ జోకర్ అంటూ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కామెంట్స్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ జోకర్ అన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. 175 నియోజక వర్గాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని సీఎం జగన్ ప్రకటించారని… ఒంటరిగా 175 చోట్ల ఒంటరిగా పోటీ చేసే దమ్ము టీడీపీ కి ఉందా అంటూ సవాల్ చేశారని..ఆ సవాల్ కు టీడీపీ నేతలు స్పందించడం లేదేంటి అని కాకాని ప్రశ్నించారు. వైస్సార్సీపీ హయాంలో ఒక్క కరువు మండలం కూడా ప్రకటించలేదని, టీడీపీ నాయకులు కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారన్నారు. 175 సీట్లలో పోటీపై సీఎం సవాల్ ను స్వీకరించే దమ్ము చంద్రబాబు కు ఉందా? అని కాకాణి ప్రశ్నించారు. ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదంటే చంద్రబాబు ఫెయిల్ అయినట్లే కదా అని అన్నారు. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లో ఏదేదో మాట్లాడుతున్నాడని, తాము ఒకరితో కలవాల్సిన అవసరం లేదన్నారు.

సంక్షేమ పథకాల అమలు చేసి ప్రజల్లోకి వెళ్లి మద్దతు ఇమ్మని అడుగుతున్నామన్నారు. యువగళం పాదయాత్రకు జనాదరణ లేదని తెలిపారు. వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్ ఆర్థిక సాయంతో పాటు, మాందోస్ తుపాను పంట నష్ట పరిహారం చెల్లించామని అన్నారు. వైస్సార్సీపీ ని నమ్ముకున్నది ప్రజలను మాత్రమే అని… ఇతర పార్టీలతో పొత్తులు తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. ప్యాకేజీలు చెల్లిస్తే కలిసే పార్టీ వైస్సార్సీపీ కాదన్నారు. ఐదేళ్ల పాటు పాలించిన చంద్రబాబు ను ప్రజలు తిరస్కరించారని, ప్రజల్లో ఆయనకు విశ్వసనీయత లేదన్నారు. కేవలం ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఉందా అని మాత్రమే ప్రశ్నిస్తున్నామని తెలిపారు. ‘‘పవన్ కళ్యాణ్‌ ను, ఆయన పార్టీని అసలు తాము గుర్తించడం లేదు. పవ‌న్‌ గురించి మాట్లాడితే మాకు అవమానం. పవన్ కళ్యాణ్ స్థాయి తోలుబొమ్మలాటలో జోకర్ మాత్రమే’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.