కేంద్ర బిల్లును రాష్ట్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది

విద్యుత్ బిల్లు 2020 వల్ల వినియోగదారులకు ఎలాంటి ఉపయోగం లేదు..జగదీష్ రెడ్డి

jagadeesh reddy
jagadeesh reddy

హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ బిల్లు 2020ని తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. కేంద్రం రూపొందించిన విద్యుత్ బిల్లు 2020 మీద కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి.. రాష్ట్రం అభిప్రాయాన్ని అడిగారని తెలిపారు. అయితే, ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రికి తేల్చి చెప్పినట్లు తెలిపారు. బిల్లు వల్ల వినియోగదారులకు ఎలాంటి ఉపయోగం లేదని స్పష్టం చేశామన్నారు. గృహ వినియోగదారులు సబ్సిడీ కోల్పోయే అవకాశం ఉందన్నారు. రైతులు కొత్త బిల్లుతో నష్టపోతారని పేర్కొన్నారు. సబ్సిడీ పొందుతున్న అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ బిల్లు 2020తో రాష్ట్రాల ప్రయోజనాలు హరించబడుతాయని అన్నారు. ప్రైవేటు సంస్థలకు పూర్తిగా అప్పగించే ప్రయత్నం నడుస్తోందన్నారు. మూడు రకాల నష్టాలు ఈ బిల్లుతో ఉన్నాయని మంత్రి చెప్పుకొచ్చారు. దేశంలో మిగతా రాష్ట్రాలు కూడా కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని అన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/