దేశంలో మార్పు కోసం కేసీఆర్‌ నడుం బిగించారు

jagadish reddy
jagadish reddy

నల్లగొండ : దేశ ప్రజలకు కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీలు ద్రోహం చేశాయి.. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ రణరంగంలోకి దూకారు.. యావత్‌ దేశం కేసీఆర్‌ వెంటే నడుస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డికి మద్దతుగా సూర్యాపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి గులాబీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఈ దేశంలో మార్పు కోసం సీఎం కేసీఆర్‌ నడుం బిగించారు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు అద్భుతమని దేశ ప్రజలు కొనియాడుతున్నారు. ఈ ఎన్నికలతో కాంగ్రెస్‌ ఖతం కావాలి. జానారెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి, దామోదర్‌ రెడ్డిలతో నల్లగొండ జిల్లా అధోగతి పాలైంది. సేవాగుణం ఉన్న వేమిరెడ్డి నర్సింహారెడ్డిని సీఎం కేసీఆర్‌ నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిపారు. మంచి గుణం ఉన్న వేమిరెడ్డి నర్సింహారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు జగదీశ్‌ రెడ్డి పిలుపునిచ్చారు.