రాష్ట్ర రైతుల ప‌క్షాన కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే ఈ ధ‌ర్నా

హైదరాబాద్: రేపు టీఆర్ఎస్ పార్టీ మ‌హాధ‌ర్నాను త‌ల‌పెట్టింద‌ని ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు పేర్కొన్నారు. ఇందిరా పార్కు వ‌ద్ద టీఆర్ఎస్ మ‌హాధ‌ర్నా ఏర్పాట్ల‌ను మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌తో క‌లిసి హ‌రీశ్‌రావు ప‌రిశీలించారు. అనంత‌రం హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర రైతుల ప‌క్షాన కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే ఈ ధ‌ర్నా నిర్వ‌హించ‌బోతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్నా, ప్ర‌భుత్వంలో ఉన్నా.. తాము ప్ర‌జ‌ల ప‌క్షాన ఉంటామ‌న్నారు. తెలంగాణ‌కు చెందిన‌ ఏడు మండ‌లాల‌ను, లోయ‌ర్ సీలేరు ప‌వ‌ర్ ప్లాంట్‌ను అన్యాయంగా ఆంధ్రాలో క‌లిపారు. దీని వ‌ల్ల సంవ‌త్స‌రానికి రూ. వెయ్యి కోట్ల న‌ష్టం వాటిల్లుతుంద‌న్నారు. ఏడు మండ‌లాల‌ను, లోయ‌ర్ సీలేరును ఆంధ్రాలో క‌లిపిన నాడే కేసీఆర్ తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

ఇవాళ కూడా ల‌క్ష‌లాది మంది రైతుల ప‌క్షాన కేంద్ర ప్ర‌భుత్వ మొండి వైఖ‌రిని నిర‌సిస్తూ ఈ మ‌హాధ‌ర్నా చేప‌ట్ట‌బోతున్నాం. దేశంలో అన్ని రాష్ట్రాల‌కు ఒకే విధానం ఉండాలి. పంజాబ్‌లో పండించే ప్ర‌తి గింజ‌ను కొంటున్నారు. తెలంగాణ‌లో పండించిన ధాన్యాన్ని మాత్రం కొన‌డం లేదు. ఈ ప‌ద్ధ‌తి స‌రికాదు. వ‌డ్లు కొనాల్సిన బాధ్య‌త కేంద్రానిదే. రాష్ట్ర రైతుల ప‌క్షాన కేంద్రంపై ఒత్తిడి పెంచాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం. రాష్ట్ర ప్ర‌జ‌లు, రైతుల కోస‌మే ఈ ధర్నా అని తేల్చిచెప్పారు. మ‌హాధ‌ర్నా శాంతియుతంగా, ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా చేయ‌బోతున్నాం. ఈ ధ‌ర్నాలో టీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్య‌లో పాల్గొంటారు అని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/