త్వరలో 50 వేల ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌: హ‌రీశ్ రావు

టీఆర్ఎస్‌ ప్ర‌భుత్వం వ‌చ్చాక 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు భ‌ర్తీ చేశాం

జ‌మ్మికుంట‌: తెలంగాణ‌లో 50 వేల ఉద్యోగాల నోటిఫికేష‌న్ రేపో మాపో విడుద‌ల చేస్తామ‌ని మంత్రి హ‌రీశ్ రావు మ‌రోసారి చెప్పారు. ఈ రోజు క‌రీంన‌గ‌ర్ జిల్లా జ‌మ్మికుంట‌లో నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ… త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చాక 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు భ‌ర్తీ చేశామ‌ని చెప్పుకొచ్చారు. తెలంగాణ‌లోని ప్ర‌తి ఇంటికి మిష‌న్ భ‌గీర‌థ ద్వారా టీఆర్ఎస్ ప్ర‌భుత్వం నీళ్లు ఇస్తోంద‌ని ఆయ‌న చెప్పారు.

అప్ప‌ట్లో తెలంగాణ‌ను 50 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ, 20 ఏళ్లు తెలుగు దేశం పార్టీ ప‌రిపాలించాయ‌ని ఆయ‌న అన్నారు. ఎవరూ క‌నీసం మంచినీటి సౌక‌ర్యం కూడా ఇవ్వ‌లేద‌ని ఆయ‌న చెప్పారు. ఇప్పుడు అంద‌రికీ తాగునీరు అందుతోంద‌ని తెలిపారు. త‌మ ప్ర‌భుత్వం పారిశుద్ధ్య ప‌నుల‌ను స‌మ‌ర్థంగా నిర్వ‌హిస్తోంద‌ని అన్నారు. ప‌ల్లెల‌ను ప‌రిశుభ్రంగా మార్చామ‌ని చెప్పుకొచ్చారు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను అమ్ముతోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/