గాంధీ ఆస్పత్రిలో సీటీ స్కాన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి హరీశ్

హైదరాబాద్ : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు శ‌నివారం ఉద‌యం న‌గ‌రంలోని గాంధీ ఆస్ప‌త్రిలో సీటీ స్కాన్ సేవ‌ల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌ధాన ఆస్పత్రుల్లో 21 సీటీ స్కాన్ కేంద్రాల‌ను మంజూరు చేశామ‌న్నారు. అందులో మొద‌టి సీటీ స్కాన్ కేంద్రాన్ని గాంధీలో ప్రారంభించామ‌ని తెలిపారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో సీటీ స్కాన్ అవ‌స‌రం ఉంది. గాంధీ ఆస్ప‌త్రిలో ముఖ్య‌మంగా గుండె జ‌బ్బుకు సంబంధించిన క్యాథ్ ల్యాబ్‌ కూడా అవ‌స‌రం ఉంది. కొత్త క్యాథ్ ల్యాబ్‌ను రూ. 6.5 కోట్ల‌తో, ఎంఆర్ఐ మిష‌న్‌ను రూ. 12.5 కోట్ల‌తో మంజూరు చేశాం. గాంధీలో ఎంఆర్ఐ, క్యాథ్ ల్యాబ్‌ను వ‌చ్చే 45 రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తామ‌న్నారు.

గాంధీ ఆస్ప‌త్రిలో కొవిడ్ సేవ‌లు అద్భుతంగా అందించారు. 84,187 మంది కొవిడ్ బాధితుల‌కు వైద్యం అందించారు. కొవిడ్ చికిత్స విష‌యంలో ప్ర‌యివేటు ఆస్ప‌త్రులు చేతులు ఎత్తేస్తే.. గాంధీకి వ‌స్తే పున‌ర్జ‌న్మ క‌ల్పించారు. ఈ ఘ‌న‌త గాంధీ ఆస్ప‌త్రి సిబ్బందికే ద‌క్కుతుంద‌న్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత గాంధీ ఆస్ప‌త్రికి రూ. 176 కోట్ల మంజూరు చేశాం. ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 100 కోట్ల ప‌నులు పూర్త‌య్యాయి. మిగిలిన ప‌నుల‌ను యుద్ధ‌ప్ర‌తిపాదిక‌న పూర్తి చేస్తామ‌ని హ‌రీశ్‌రావు ప్ర‌క‌టించారు. గాంధీలో అత్యాధునిక‌మైన ప‌రిక‌రాల‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకొస్తామ‌న్నారు. గాంధీ ఆవ‌ర‌ణ‌లో 200 ప‌డ‌క‌ల ఎంసీహెచ్ ఆస్ప‌త్రి త్వ‌ర‌లోనే అందుబాటులోకి తీసుకొస్తామ‌న్నారు. నాలుగైదు నెల‌ల్లోనే పూర్తి చేస్తామ‌ని హ‌రీశ్‌రావు తెలిపారు. ఉస్మానియా ఆస్ప‌త్రిలో క్యాథ్ ల్యాబ్‌ రెడీగా ఉంద‌న్నారు. వ‌చ్చే రెండు, మూడు రోజుల్లో క్యాథ్ ల్యాబ్‌ను ప్రారంభించి, రోగులుకు హార్ట్ స‌ర్జ‌రీలు చేస్తామ‌ని హ‌రీశ్‌రావు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/