యోగాను దినచర్యలో భాగంగా చేసుకొవాలి : మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట : నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్‌ విభాగం ఆధ్వర్యంలో సిద్ధిపేట పట్టణం కొండా భూదేవి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన యోగా వేడుకల్లో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యోగాను దినచర్యలో భాగంగా చేసుకొని దీర్ఘాయుష్షును పొందాలన్నారు. ప్రపంచంలో చాలామందికి ఆహారం అలవాట్లతోనే రోగాలు వస్తాయన్నారు.

యోగాతో రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చన్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు యోగా సాధన చేయవచ్చని తెలిపారు. శారీరక, మానసిక సమస్యల నుంచి తమను తాము కాపాడుకోవచ్చని చెప్పారు. యోగా, వాకింగ్, సూర్య నమస్కారాలు చేస్తే రోజువారీ పనులను మరింత చురుగ్గా చేసుకోవచ్చన్నారు. భారతదేశాన్ని చూసి వివిధ దేశాలు యోగాను నేర్చుకుంటాయని తెలిపారు. ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణులకు యోగాలాంటి శిక్షణ ఇస్తున్నామని, గర్భిణులు యోగాలాంటివి చేస్తే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుందన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/