మోడీ అంటే మోదుడు.. బీజేపీ అంటే బాదుడు – మంత్రి హరీష్ రావు చురకలు

ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఎలాగైతే తెరాస నేతలు రోడ్డెక్కారు..ఇప్పుడు వరి కొనుగోలు విషయంలో అలాగే రోడ్డుక్కారు. రోజు రోజుకు వరి యుద్ధం తారాస్థాయికి చేరుతుంది. ఈరోజు హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలో తెరాస నేతలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద 10 వేల మందితో మంత్రి హరీష్ రావు నిరసన దీక్ష చేపట్టారు. తెలంగాణలో రైతులు పండించిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. యాసంగి పంటను పూర్తిగా కొనే వరకూ కేంద్రంపై పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పంజాబ్‌ తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలోనూ రైతుల పండించిన పంటలను పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

త‌మ‌ది గొంతెమ్మ కోరిక కాద‌ని, రైతుల కోసం చేస్తున్న ధ‌ర్మ‌పోరాట‌మ‌ని చెప్పారు. నాడు కేంద్రంలోని అన్ని ప్రభుత్వాలు ఎలాంటి ఆంక్ష‌లు లేకుండా వడ్లు కొన్నాయ‌ని తెలిపారు. మోడీ స‌ర్కారు ఇప్పుడే ఎందుకు ధాన్యం కొన‌బోన‌ని మొండికేస్తుందో తెలియ‌డం లేద‌న్నారు. కేంద్ర స‌ర్కారు లాభనష్టాలు బేరీజు వేసుకుని ప్రైవేట్‌ కంపెనీ లిమిటెడ్ కంపెనీలాగా ప‌నిచేస్తున్న‌ద‌ని మండిప‌డ్డారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. అచ్చే దిన్ అని చెప్పి స‌చ్చే దిన్ తీసుకొచ్చార‌ని విమ‌ర్శించారు. రేపు (శుక్రవారం) ప్రతి రైతు ఇంటిపై నల్ల జెండా ఎగరాలని, దీనికి సంబంధించిన వీడియోలు తీసి తనకు పంపాలని కార్యకర్తలు, సర్పంచ్‌లకు సూచించారాయన. వడ్లు కొనాలంటే ఈ జెండా ఎగరేయాలని చెప్పి బీజేపీ కార్యకర్తల ఇంటిపైనా నల్ల జెండాలు పెట్టాలని ఆదేశించారు. ప్రతి ఊరిలో, ప్రతి ఒక్క ఇంటిపైనా నల్ల జెండా కనిపించాలని, ఢిల్లీకి తెలిసొచ్చేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు రోజురోజుకూ పెరుగుతున్నాయ‌ని, మోదీ స‌ర్కారు సామాన్యుడి న‌డ్డి విరుస్తోందని మంత్రి హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. మోడీ అంటే మోదుడు.. బీజేపీ అంటే బాదుడు అని విమ‌ర్శించారు.