కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫై మంత్రి హరీష్ రావు ఫైర్

కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేషన్ ద్వారా పేదలకు ఇచ్చే బియ్యం మొత్తం కేంద్రమే ఇస్తున్నట్లు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం 10 పైసలు ఇచ్చి రూపాయి ప్రచారం చేసుకుంటోందని ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పే కేంద్ర మంత్రుల జాబితాలో మంత్రి నిర్మలా సీతారామన్ కూడా చేరారని హరీశ్ రావు విమర్శించారు.

బీజేపీ నేతలు దిగజారేలా మాట్లాడొద్దనీ.. నోరు విప్పితే అన్నీ అబద్ధాలే చెబుతున్నారని మండిపడ్డారు. రేషన్ బియ్యం పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.3600 కోట్లు ఖర్చు చేస్తే, కేంద్రం రూ.150 కోట్లు ఇస్తోందని చెప్పారు. దేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని హరీశ్ రావు అన్నారు.

‘తెలంగాణ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి లక్షల కోట్ల రూపాయలు వెళ్తున్నాయి. అక్కడ నుంచి మనకు వచ్చేవి అరకొర నిధులే. తెలంగాణ ప్రజల సొమ్మును ఇతర రాష్ట్రాల్లో అభివృద్ధి పనులకు వినియోగిస్తున్నారు. దేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. తెలంగాణ నుంచి వస్తున్న నిధులను కేంద్ర ప్రభుత్వ పథకాలకు వాడుకుంటున్నారు కదా.. మరి కేంద్రంలో మా కేసీఆర్ ఫొటోను పెట్టుకుంటారా?’ అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఉచిత బియ్యం పంపిణీకి మెజార్టీ నిధులు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నా.. తాము కేసీఆర్ ఫొటో పెట్టుకోలేదని, నిర్మలా సీతారామన్ మాత్రం మోడీ ఫొటో పెట్టలేదనడం దారుణమని హరీశ్ రావు అన్నారు.

కామారెడ్డిలో రెండో రోజు పర్యటిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ లో రేషన్ షాప్ తనిఖీ చేశారు నిర్మలా సీతారామన్. ఈ సందర్భంగా పేదలకు ఇచ్చే రేషన్ బియ్యంలో కేంద్రం వాటా, రాష్ట్ర వాటా ఎంత అని కలెక్టర్ ని ప్రశ్నించారు కేంద్ర మంత్రి అడిగిన ప్రశ్నకు తనకి తెలియదని కలెక్టర్ సమాధానం చెప్పడం తో నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

మీరు IAS ఆఫీసర్ అయ్యి మీకు ఎలా తెలియదు అని ప్రశ్నించారు. అరగంట టైమ్ ఇస్తాను తెలుసుకొని చెప్పమని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తోంది కదా.. ఈ విషయాన్ని ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. రేషన్ షాపులో మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదంటూ కలెక్టర్ జితేష్ పటేల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుండి రేషన్‌ షాపులకు ప్రధాని మోడీ ఫ్లేక్సీల కట్టాలని.. ఒక వేళ మోడీ ఫ్లేక్సీ కట్టకపోతే.. తానే సాయంత్రం వచ్చి మరీ.. ప్లేక్సీ కడతానని తెలిపారు.