కస్తూర్భా గాంధీ బాలికల హాస్టల్‌ ఘటన ఫై మంత్రి ఎర్రబెల్లి ఫైర్

Minister Errabelli Fire in Kasturbha Gandhi Girls Hostel incident

Community-verified icon


జనగాం జిల్లాలోని కస్తూర్భా గాంధీ బాలికల హాస్టల్‌లో బల్లి పడిన ఆహారం తిని 50 మందికి పైగా హాస్పటల్ పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఫై మంత్రి ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇటీవల కాలంలో ప్రభుత్వ హాస్టల్స్ లలో పిల్లలకు అందించే ఆహారం ఏమాత్రం నాణ్యతగా ఉండడంలేదు. రాత్రి వండిన ఆహారాన్నే తెల్లారి పెడుతుండడంతో విద్యార్థులు అనారోగ్యానికి గురి అవుతున్నారు. అంతే కాదు పురుగులు పట్టిన బియ్యం , బల్లులు పడిన ఆహారాన్ని పిల్లలకు అందజేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే పలు చోట్ల జరుగగా..తాజాగా జనగాం జిల్లాలో చోటుచేసుకుంది.

దేవరుప్పుల గ్రామంలో కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయం (కేజీబీవీ) లో విద్యార్థినులకు గురువారం రాత్రి అందించిన ఆహారంలో బల్లి పడింది. దోసకాయ పచ్చడిలో బల్లి రావడాన్ని విద్యార్థులు గమనించారు. ఆలోపే కొందరు విద్యార్థులు ఆ పచ్చడి తిన్నారు. దీంతో 50 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులతో ఇబ్బంది పడ్డారు. వెంటనే అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది అస్వస్థతకు గురైన విద్యార్థినులను స్థానిక జనగామ ప్రభుత్వాసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీరియస్ గా తీసుకున్నారు. పాఠశాల భవనాన్ని జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, ఆర్డీఓ, సంబంధిత అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. స్కూల్ పరిసరాలు, వంట గది, భోజన హాల్ పరిశీలించిన మంత్రి.. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో వేర్వేరుగా సమావేశమై అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. సిబ్బంది ఆలస్యంగా వస్తున్నారని, సాయంత్రం 5 గంటలకల్లా వండి వెళ్లి పోతున్నారని.. తామే వడ్డించుకుంటున్నమని మంత్రికి విద్యార్థులు తెలిపారు.
అన్నంలో బల్లి రావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. యాజమాన్యం, సిబ్బందిపై మండిపడ్డారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులు ఆరోగ్యంగా ఉన్నారని.. ఏమైనా ప్రమాదం జరిగి ఉంటే పర్యవసానాలు ఏంటో తెలుసా? అని నిలదీశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని.. దోషులుగా తేలిన వాళ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని అధికారులను ఆదేశించారు.