దివంగత ఎన్టీఆర్‌పై మంత్రి దాడిశెట్టి రాజా అనుచిత వ్యాఖ్యలు

దివంగత ఎన్టీఆర్‌పై ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా అనుచిత వ్యాఖ్యలు చేసి టీడీపీ శ్రేణుల్లో,అభిమానుల్లో ఆగ్రహం తెప్పించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు ఫై పెద్ద రగడ నడుస్తున్న సంగతి తెలిసిందే. వైస్సార్సీపీ , టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు వైస్సార్సీపీ నేతలు చంద్రబాబు ఫై పలు వ్యాఖ్యలు చేయగా..తాజాగా మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్‌పై రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రం ఆయన గుప్పిట్లో ఉండగా.. మంత్రివర్గ సభ్యుడైన నాదెండ్ల భాస్కరరావుతో ఒకసారి, సొంత అల్లుడు చంద్రబాబుతో మరోసారి వెన్నుపోటు పొడిపించుకున్నారని ఎద్దేవా చేసారు.

తన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పుకొచ్చారు. సోమవారం కాకినాడ జిల్లా తొండంగిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్టీఆర్‌కు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి పోలికే లేదు. వైఎస్‌ ప్రజల మనిషి. అమరావతి రైతుల రూపంలో అమరావతి స్థిరాస్తి వ్యాపార మేళం ప్రతి నియోజకవర్గంలో తిరుగుతోంది. వీరంతా వ్యంగ్యంగా నాట్యం చేస్తూ, తొడలు కొడుతున్నారు. వీరి చేష్టలను రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు’ అని మంత్రి రాజా పేర్కొన్నారు.