ఉద్యోగులకు కనీస పింఛను రూ.2వేలు!

Employees Provident Fund Service in india
Employees Provident Fund Service in india

హైదరాబాద్‌: ఉద్యోగుల భవిష్యనిధి పింఛనుదారులకు కొంత ఊరట కలిగించేలా కనీస పింఛను రూ.2వేలకు పెంచేందుకు ఈపీఎఫ్‌వో కసరత్తు చేస్తుంది. ఈమేరకు పలు ప్రతిపాదనలకు ఈపీఎఫ్‌వో ఉన్నతస్థాయి కమిటి నివేదికలో పొందుపరించింది. దీంతో దేశవ్యాప్తంగా సూమారు 30 లక్షల మంది ఈపీఎఫ్‌ పింఛనుదారులకు లబ్ధి చేకూరే అవకాశముంది. ఇటివల జరిగిన ఈపీఎఫ్‌వో ట్రస్టీల సమావేశంలో కనీస పింఛను పెంపు విషయమై అధికారికంగా నిర్ణయం వెలువడాల్సినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో వాయిదా పడింది. కనీస పింఛను రూ.6 వేలకు పెంచాలన్న ఉద్యోగ సంఘాల ప్రతినిధుల డిమాండ్‌ను పింఛను అమలు కమిటీ తిరస్కరించింది. పింఛనుదారులకు డీఏ చెల్లించడం కుదరదని ప్రతిపాదించింది. మరోవైపు ఈపీఎఫ్‌95 పథకంలో మరిన్ని మార్పులు చేసేందుకు సంస్థ కసరత్తు మొదలుపెట్టింది. రూ.2 వేల కనీస పింఛనుపై రానున్న సీబీటీ సమావేశంలోగా స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశమున్నట్లు ఈపీఎఫ్‌వో వర్గాలు పేర్కొంటున్నాయి. కనీస పింఛను రూ.2 వేలకు పెంచాలని భావిస్తున్న నేపథ్యంలో మరిన్ని సంస్కరణలను ఈపీఎఫ్‌వో పరిశీలిస్తోంది. నిర్వహణ భారం పెరగనుండటంతో అదనపు పింఛను మొత్తాన్ని కేంద్రం బడ్జెట్‌ ద్వారా ఇవ్వాలని ఉన్నతస్థాయి కమిటీ సూచించింది. అదే సమయంలో వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలు పెంచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈపీఎఫ్‌లో చందాదారుడిగా చేరిన కార్మికుడు, ఉద్యోగి సర్వీసు పదేళ్లలోపు ఉంటే పింఛను నిధి (ఈపీఎస్‌) మొత్తాన్ని తీసుకునేందుకు వెసులుబాటు ఉండేది. కొత్త సంస్కరణ అమల్లోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈపీఎస్‌ మొత్తాన్ని ఉపసంహరించేందుకు అనుమతివ్వరని తెలుస్తోంది. పింఛను పెంపుపై ఉన్నతస్థాయి కమిటీ నివేదికలో పలు సంస్కరణలతో కేంద్ర మంత్రివర్గానికి సమర్పించారు. అక్కడ ఆమోదం పొందిన తరువాత పూర్తి నివేదిక వివరాలు వెల్లడి కానున్నాయి.