య‌శ్వంత్ సిన్హా కు ఏఐఎంఐఎం మద్దతు

విపక్ష పార్టీల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా కు ఏఐఎంఐఎం మద్దతు పలికింది. ఈరోజు సోమవారం యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఉదయం రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పీసీ మోదీకి నామినేషన్​ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్‌, ఎస్పీ అధినేత అఖిలేశ్​ యాదవ్​, టీఎంసీ, డీఎంకే ఎంపీలు తదితరులు పాల్గొన్నారు.

నామినేష‌న్ వేసిన రోజున‌నే ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తూ మ‌జ్లిస్ (ఏఐఎంఐఎం) అధినేత‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మ‌జ్లిస్ పార్టీ ప్ర‌జా ప్ర‌తినిధులు రాష్ట్రప‌తి ఉన్నిక‌ల్లో విప‌క్షాల ఉమ్మడి అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న య‌శ్వంత్ సిన్హాకే ఓటు వేస్తార‌ని స‌ద‌రు ప్ర‌క‌ట‌న‌లో అస‌దుద్దీన్ ప్ర‌క‌టించారు. ఈ విష‌యంపై ఇప్ప‌టికే య‌శ్వంత్ సిన్హా త‌న‌కు ఫోన్ చేశార‌ని, ఆ సంద‌ర్భంగానే ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాన‌ని ఆయ‌న తెలిపారు.

అలాగే కేటీఆర్ సైతం యశ్వంత్​ సిన్హాకు మద్దతు ఇవ్వడానికి గల కారణాలు చెప్పుకొచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ, నిరంకుశ విధానాలతో పాలన సాగిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. మోదీ ప్రభుత్వం వచ్చాక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని.. ఇప్పటివరకు ఎనిమిది రాష్ట్రాల్లో బీజేపీకి మెజారిటీ లేకపోయినా తప్పుడు మార్గాల్లో అధికారం పొంది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని విమర్శించారు. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిని తిరస్కరిస్తూ.. విపక్షాల అభ్యర్థిని బలపరిచామని, ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.