పాతబస్తీలో టెన్షన్ వాతావరణం..

పాతబస్తీలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల ఫై ఎంఐఎం కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఎంఐఎం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాజాసింగ్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేయగా..బెయిల్ ఫై విడుదల అయ్యారు. తాను విడుదలైన తర్వాత మరిన్ని వీడియోలు పోస్ట్ చేస్తానని రాజాసింగ్ పేర్కొనడంతో పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఒక వర్గానికి చెందిన యువత రోడ్లపైకి చేరుకున్నారు.

చార్మినార్‌, మదీన, చంద్రాయణగుట్ట, బార్కాస్‌, సిటీ కాలేజ్‌ తదితర ప్రాంతాల్లో… వందల సంఖ్యలో రోడ్లపై చేరి రాజాసింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లజెండాలను చేత పట్టుకుని నిరసన తెలిపారు. మదీన, అఫ్జల్‌గంజ్‌, చార్మినార్‌ కూడలిలో గుంపులుగా చేరిన పలువురు… కూడళ్ల వద్ద వాహనాలను నిలిపి నినాదాలు చేశారు. ఆయా ప్రాంతాల్లో నల్లజెండాలతో నిరసన ర్యాలీ చేశారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని.. ఆందోళనకారులు విధ్యంసానికి పాల్పడకుండా చర్యలు చేపట్టారు. తెల్లవారుజామున 4 గంటల వరకు నిరసనకారులు ఆందోళన కొనసాగించారు. మరో వైపు ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఇంటి వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఇతరులెవరు ఆయన ఇంటి వైపు రాకుండా బారికేడ్లు ఏర్పాటుచేశారు.