మైక్రోసాప్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల కుమారుడు మృతి

సెరిబ్రల్ పాల్సీతో తుది శ్వాస

వాషింగ్టన్ : మైక్రోసాఫ్ట్ సీఈవో, భారత సంతతి అమెరికన్ సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల (26) సోమవారం మృతి చెందాడు. సత్య నాదెళ్ల, అనుపమ దంపతులకు కుమారుడు జైన్ తోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జైన్ పుట్టుకతోనే సెరిబ్రల్ పాల్సీ వ్యాధి బారిన పడ్డాడు. చిన్నప్పటి నుంచి వీల్ చైర్‌కే జైన్ అంకితమయ్యాడు. జైన్ నడవలేడు, చూడలేడు, సరిగా మాట్లాడలేడు. ఇక ఈ బాధను భరించలేక ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ నాదెళ్ల తిరిగారు కానీ ఎలాంటి ఫలితం లేదు. జైన్ మరణించినట్టు మైక్రోసాఫ్ట్ కంపెనీ తన ఉద్యోగులకు ఈ మెయిల్ ద్వారా తెలియజేసింది. నాదెళ్ల కుటుంబం కోసం ప్రార్థించాలని, వారికి ఏకాంతాన్ని ఇవ్వాలని కోరింది.

కాగా, సత్య నాదెళ్ల హైదరాబాద్ కు చెందిన వారు. ఆయన తండ్రి బుక్కాపురపు నాదెళ్ల యుగంధర్ 1962 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కాగా, తల్లి ప్రభావతి సంస్కృత లెక్చరర్. హైదరాబాద్ లోనే పాఠశాల విద్య పూర్తి చేసుకున్న సత్య నాదెళ్ల కర్ణాటకలో మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఎంఎస్ కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. తన తండ్రి తోటి ఐఏఎస్ అధికారి కుమార్తె అయిన అనుపమను వివాహం చేసుకున్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/