హైదరాబాద్ లో ప్రారంభమైన మెట్రో రైళ్లు

హైదరాబాద్ లో మెట్రో రైళ్లు ప్రారంభమయ్యాయి. ఆర్మీ ఉద్యోగార్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ల‌లో చేప‌ట్టిన ఆందోళ‌న‌ల‌తో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట నుంచి హైద‌రాబాద్‌లో మెట్రో రైళ్ల‌ను నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. సికింద్రాబాద్ స్టేష‌న్‌లో ఉద్రిక్త ప‌రిస్థితులు స‌ద్దుమ‌ణిగిన త‌ర్వాత మెట్రో స‌ర్వీసుల‌ను పునరుద్ధ‌రించారు. సాయంత్రం 6:35 గంట‌ల నుంచి మెట్రో రైళ్లు అందుబాటులోకి వ‌చ్చాయి. మూడు కారిడార్ల‌లో మెట్రో స‌ర్వీసులు న‌డుస్తున్నాయి. అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు చేసిన నిరసనలతో ముందస్తు జాగ్రత్తగా హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులను రద్దు చేశారు. సికింద్రాబాద్ స్టేషన్లో ఉద్రిక్తతలు చల్లారడంతో ఆగిపోయిన మెట్రో రైళ్లు మళ్లీ సేవలు ప్రారంభించాయి. సాయంత్రానికి మెట్రో రైళ్లు పరుగులు తీశాయి.

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో యథావిధిగా రైళ్లు పున‌రుద్ధ‌రించ‌బ‌డ్డాయి. ఉద‌యం నుంచి యువ‌త‌తో అట్టుడికిన రైల్వే స్టేష‌న్‌లో ప్ర‌స్తుతం ప్ర‌శాంత వాతావ‌ర‌ణం నెల‌కొంది. స్టేష‌న్‌లోని అన్ని ప్లాట్ ఫాంల‌లో పోలీసులు భారీగా మోహ‌రించారు. ఉద్రిక్త ప‌రిస్థితులు స‌ద్దుమ‌ణ‌గ‌డంతో.. సికింద్రాబాద్‌లోని ఒక‌టో నంబ‌ర్ ప్లాట్ ఫాం నుంచి లింగంప‌ల్లి – కాకినాడ గౌత‌మి ఎక్స్‌ప్రెస్ బ‌య‌ల్దేరింది. మ‌రికాసేప‌ట్లో గ‌రీభ్‌ర‌థ్‌, దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా బ‌య‌ల్దేర‌నున్న‌ట్లు సికింద్రాబాద్ డివిజన‌ల్ రైల్వే మేనేజ‌ర్ అభ‌య్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. అయితే ర‌ద్దు అయిన రైళ్ల‌కు సంబంధించిన ప్ర‌యాణికుల‌కు టికెట్ డ‌బ్బుల‌ను రిఫండ్ చేస్తామ‌ని గుప్తా స్ప‌ష్టం చేశారు.