నగరవాసులకు గుడ్ న్యూస్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టు వ‌ర‌కు మెట్రో

హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్. మెట్రో రైలు సెకండ్ ఫేజ్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మైండ్‌స్పేస్ జంక్షన్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో కారిడార్‌ నిర్మించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. డిసెంబరు 9వ తేదీన సీఎం కేసీఆర్‌ ఇందుకు భూమిపూజ చేయనున్నారు. 31 కిలోమీటర్ల మేర చేపట్టే ఈ సెకండ్ ఫేజ్ కోసం సుమారు రూ.6,250 కోట్ల ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.

2017 నవంబర్ లో నాగోల్ – అమీర్పేట్ – మియాపూర్ మెట్రో మార్గం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. 2018 అక్టోబర్ లో ఎల్బీనగర్ – అమీర్పేట్ మెట్రో లైన్ను ప్రారంభించారు. 2019 మార్చిలో అమీర్పేట్ –హైటెక్ సిటీ మెట్రో లైన్ ను ప్రారంభించారు. జేబీఎస్ – ఎంజీబీఎస్ మెట్రో లైన్ 2020 ఫిబ్రవరి 7 నుంచి అందుబాటులోకి వచ్చింది.

మెట్రోలో కరోనా ముందు వరకు దాదాపు 5 లక్షల మంది ప్రయాణించగా.. ప్రస్తుతం సుమారు 4లక్షల వరకు ప్రయాణిస్తున్నారు. రానున్న రోజుల్లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరణ జరిగినట్లయితే ఇంకా ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.