రేపు సీఎం జ‌గ‌న్‌తో భేటీకానున్న మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి

విక్ర‌మ్ రెడ్డి అభ్యర్థిత్వంపై సీఎంతో రేపు మేక‌పాటి చ‌ర్చ‌లు

అమరావతి: ఏపీ మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌కు ముందు గుండెపోటుతో మంత్రి మేక‌పాటి గౌతమ్ రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన సంగ‌తి తెలిసిందే. మొన్న‌టి మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ సంద‌ర్భంగా మేక‌పాటి కుటుంబానికే చెందిన ఉద‌య‌గిరి ఎమ్మెల్యే మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి కూడా ఎలాంటి అవ‌కాశం క‌ల్పించ‌లేదు. అంతేకాకుండా గౌత‌మ్ రెడ్డి మ‌ర‌ణంతో ఖాళీ అయిన ఆత్మ‌కూరు అసెంబ్లీకి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌లో పార్టీ అభ్యర్ధి ఎవ‌ర‌న్న‌ది కూడా ఇంకా తేల‌లేదు.

ఈ నేప‌థ్యంలో గౌత‌మ్ రెడ్డి తండ్రి, మాజీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి గురువారం నాడు సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో భేటీ కానున్నారు. ఈ భేటీలో గౌత‌మ్ రెడ్డి స్థానంలో ఆత్మ‌కూరు ఉప ఎన్నిక బ‌రిలో పార్టీ అభ్య‌ర్థిగా గౌత‌మ్ రెడ్డి సోద‌రుడు విక్ర‌మ్ రెడ్డి పేరును ప్ర‌క‌టించాల‌ని సీఎంను మేక‌పాటి కోరే అవ‌కాశాలున్నాయి.

ఈ సీటును గౌత‌మ్ రెడ్డి భార్యకు కాకుండా ఆయ‌న సోద‌రుడికి అవ‌కాశం ఇద్దామ‌ని మేక‌పాటి కుటుంబం ఇటీవ‌లే నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఇదే విష‌యాన్ని సీఎంకు తెలి‌య‌జేసి ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌లో పార్టీ అభ్య‌ర్థిగా విక్ర‌మ్ రెడ్డి పేరును ఖ‌రారు చేయించే దిశ‌గా మేక‌పాటి కీల‌క చ‌ర్చ‌లు జ‌ర‌పనున్న‌ట్లు స‌మాచారం. మేక‌పాటి ప్ర‌తిపాద‌న‌కు సీఎం ఇప్ప‌టికే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టుగా పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/