సస్పెన్షన్ వల్ల ఎంతో రిలాక్స్ గా ఉందన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ వైస్సార్సీపీ కి భారీ షాక్ తగిలిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో విజయం సాధించారు. కేవలం 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న టీడీపీకి… 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు పడ్డాయి. ఆ నాల్గు ఓట్లు వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు వేశారు. దీనిని సీరియస్ గా తీసుకున్న వైస్సార్సీపీ..ఆ ఓట్లు వేశారనే నేపథ్యంలో నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ సస్పెన్షన్ ఫై ఇప్పటికే శ్రీధర్ రెడ్డి తన స్పందనను తెలియజేయగా..తాజాగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. సస్పెన్షన్ వల్ల ఎంతో రిలాక్స్ గా ఉందన్నారు.

మంచి చేసిన వారికి కూడా కొందరు చెడు చేస్తారని మేకపాటి వ్యాఖ్యానించారు. అనుకున్నది చేసేయడం వైస్సార్సీపీ లో అలవాటుగా మారిందని విమర్శించారు. జగన్ కు మద్దతు ఇచ్చినందుకు పార్టీలో చాలా మర్యాదలు చేశారన్నారు. తన నియోజకవర్గాన్ని భ్రష్టుపట్టించారని తెలిపారు. కావాలంటే ఇప్పుడే రాజీనామా చేస్తా… ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. పార్టీ అగ్రనేతలకు మానవతా విలువలు అవసరం అని హితవు పలికారు.

ఇక మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సస్పెన్షన్ ఫై స్పందించారు. తనపై చర్యలు తీసుకున్న విధానం సరికాదని కోటంరెడ్డి అభిప్రాయపడ్డారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం అని పేర్కొన్నారు. పార్టీ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే, మొదట షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో చర్యలు తీసుకోలేదన్న విషయం స్పష్టమైందని, పార్టీలో పెత్తందారీ విధానం నడుస్తోందని కోటంరెడ్డి విమర్శించారు. ఏదేమైనా, పార్టీ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని తెలిపారు.