‘ వై నాట్ 175 ‘ అని జగన్ ఏ ధైర్యంతో అనగలుగుతున్నారో అర్థం కావడం లేదు – మేకపాటి

‘ వై నాట్ 175 ‘ అని జగన్ ఏ ధైర్యంతో అనగలుగుతున్నారో అర్థం కావడం లేదన్నారు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ ప్రభుత్వం ఫై , జగన్ తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. వై నాట్ 175 అని జగన్ ఏ ధైర్యంతో అనగలుగుతున్నారో అర్థం కావడం లేదన్నారు. అధినాయకత్వం వద్దకు తమ వంటి సీనియర్లు వెళితే పలకరించే దిక్కు కూడా లేదని వాపోయారు. వైస్సార్సీపీ లో 50 మంది ఎమ్మెల్యేలను తీసేస్తారని ప్రచారం జరుగుతోందని తెలిపారు.

“నా నియోజకవర్గంలో నేనండీ ఎమ్మెల్యేని. అలా కాకుండా, ఎవరో తాడుబొంగరం లేని వాళ్లను తీసుకువచ్చి, ఆయన చెప్పినట్టు వినండి అంటూ అధికారులకు సూచిస్తున్నారు. ఎమ్మెల్యేలకు సీఎం సరైన గౌరవం ఇవ్వడంలేదు. సీఎం సరే… ఆయన పక్కనున్న వాళ్లు కూడా ఎమ్మెల్యేకి నమస్కారం పెట్టరు. సీఎం పక్కన పెద్ద సంఖ్యలో సలహాదారులు ఉంటారు… వాళ్లు చేసే పనేంటి? ఎమ్మెల్యేలకు విలువ, గౌరవం ఇవ్వని పార్టీలు మూతపడక తప్పదన్నారు’ మేకపాటి. సస్పెన్షన్ వల్ల ఎంతో రిలాక్స్ గా ఉందన్నారు.

మంచి చేసిన వారికి కూడా కొందరు చెడు చేస్తారని మేకపాటి వ్యాఖ్యానించారు. అనుకున్నది చేసేయడం వైస్సార్సీపీ లో అలవాటుగా మారిందని విమర్శించారు. జగన్ కు మద్దతు ఇచ్చినందుకు పార్టీలో చాలా మర్యాదలు చేశారన్నారు. తన నియోజకవర్గాన్ని భ్రష్టుపట్టించారని తెలిపారు. కావాలంటే ఇప్పుడే రాజీనామా చేస్తా… ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు.