వ్యభిచారం కేసులో మేఘాలయ బీజేపీ ఉపాధ్యక్షుడు అరెస్ట్

మేఘాలయ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్‌ మరక్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త‌న ఫాంహౌస్ లో వ్య‌భిచార గృహాన్ని న‌డుపుతున్న‌ట్లు ఆరోప‌ణ‌లు రావడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసారు. వెస్ట్ గారోహిల్స్ జిల్లాలోని తురా పట్టణంలోని బెర్నార్డ్‌ మరక్‌ ఫాంహౌస్ ​లో భారీఎత్తున వ్యభిచార దందా కొనసాగిస్తున్నారని కొద్ది రోజుల క్రితం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఫామ్ హౌస్ పై ప్రత్యేక నిఘా వుంచిన పోలీసులు వ్యభిచారం జరుగుతున్నట్లు నిర్దారించుకున్నారు. శనివారం పోలీసులు దాడులు చేశారు. ఆరుగురు మైనర్లకు విముక్తి కల్పించి.. మొత్తంగా 73 మంది ఈ వ్యభిచార దందాతో సంబంధమున్నవారిని అరెస్ట్ చేసారు.

ఈ దాడిలో 27 వాహనాలు, 400 మద్యం బాటిళ్లు, 500 కండోమ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని కోర్టులో హాజరుపర్చామని… మైనర్ బాలికలను మాత్రం రెస్క్యూ హోం కి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు రాగా, మరాక్ రాష్ట్రం విడిచి పరారయ్యారు. పోలీసులు అతడిని ఎట్టకేలకు అరెస్ట్ చేసారు. ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఫాంహౌస్ పై దాడుల అనంతరం, మరాక్ ను విచారణకు సహకరించాలని కోరినా, అతడు నిరాకరించాడని పోలీసులు వెల్లడించారు. అతడు రాష్ట్రం వీడడంతో మేఘాలయ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తురాలోని ఓ న్యాయస్థానం మరాక్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.