లాక్ డౌన్ తో ర‌క్త దాత‌ల కొర‌త‌.. రోగుల ప్రాణాలు కాపాడుదాం …

‘మెగాస్టార్’ చిరంజీవి పిలుపు

Chiranjeevi blood donation

Hyderabad: ర‌క్తం అవ‌స‌రం ప‌డేవారికి లాక్ డౌన్ పెను స‌మ‌స్యాత్మ‌కంగా మారింది. బ్ల‌డ్ బ్యాంక్స్ లో ర‌క్త నిల్వ‌లు అడుగంట‌డంతో ఆస్ప‌త్రి వ‌ర్గాల్లోనూ తీవ్ర‌ ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

అయితే ఈ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌జ‌లు అభిమానులు విరివిగా ర‌క్త‌దానం చేయాల‌ని అందుకు స‌మీప బ్ల‌డ్ బ్యాంక్స్ కి వెళ్లాల‌ని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు.

ఆదివారం అయన హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ కి ఆదివారం ఉదయం స్వయంగా వచ్చి ర‌క్త‌దానం ఇచ్చారు.

చిరంజీవితో స‌హా హీరో శ్రీ‌కాంత్- రోష‌న్, శ్రీ‌మిత్ర చౌద‌రి.. వారి వార‌సులు తేజ్ నివాస్, తేజ్ గోవింద్, బెన‌ర్జీ, నటుడు భూపాల్, గోవింద‌రావు, విజ‌య్, సురేష్ కొండేటి త‌దిత‌రులు ర‌క్త‌దానం చేసిన వారిలో ఉన్నారు.

ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ-“లాక్ డౌన్ వేళ ర‌క్త దాత‌ల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గింది. ర‌క్తం ఇచ్చేవారు లేక‌ కొర‌త ఎక్కువ‌గా ఉంది. పేషెంట్స్ చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు.

త‌ల‌సేమియా-క్యాన్సర్ వ్యాధిగ్ర‌స్తులు.. బైపాస్ స‌ర్జ‌రీ – హార్ట్ రోగులు.. ప్ర‌మాదాల‌కు గురైన వారు.. ఎనీమియా వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.

ఇలాంటి స‌మ‌యంలో ర‌క్తం లేక ఇబ్బంది ప‌డుతున్న వారిని ఆదుకునేందుకు ప్ర‌జ‌లు అభిమానులు ముందుకు రావాలి. మీకు స‌మీపంలో ఉన్న బ్ల‌డ్ బ్యాంక్స్ కి ర‌క్త‌దానం చేయండి.

స్వ‌చ్ఛందంగా ర‌క్త‌దానం చేస్తే ప్రాణ‌దానం చేసిన‌వారు అవుతారు. ఈ బాధ్య‌త మ‌నంద‌రిపైనా ఉంది. ర‌క్తం దొర‌క్క చ‌నిపోతున్నార‌నే ప‌రిస్థితి రాకుండా కాపాడండి. బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించండి.

త‌మ్ముడు శ్రీ‌కాంత్.. మిత్రుడు శ్రీ‌మిత్ర చౌద‌రి .. వారి స్నేహితులు వ‌చ్చి ర‌క్త‌దానం ఇచ్చి స్ఫూర్తి నింపారు.

దీనిని ఇన్ స్పిరేష‌న్ గా తీసుకుని ఇరు తెలుగు రాష్ట్రాల్లో నా అభిమానులు ర‌క్త‌దానం చేయాల‌ని కోరుతున్నాను.

లాక్ డౌన్ ఉన్నా ర‌క్త‌దానం చేయొద్ద‌ని ఎవ‌రూ ఆప‌రు. బ‌య‌ట పోలీసుల వ‌ల్ల ఏ ఇబ్బందీ త‌లెత్త‌దు.

ర‌క్త‌దానం చేస్తున్నాం అని తెల‌ప‌గానే బ్ల‌డ్ బ్యాంక్ వారి నుంచి మీ ఫోన్ వాట్సాప్ కు పాస్ వ‌స్తుంది. అది పోలీసుల‌కు చూపిస్తే స‌రిపోతుంది ”’ అని తెలిపారు.

తాజా ‘నాడి వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/