గద్దె పైకి చేరిన సారలమ్మ..చిలకలగుట్ట నుంచి రానున్న సమ్మక్క

కొలువుదీరిన పగిడిద్దరాజు, గోవిందరాజులు

వరంగల్‌: తెలంగాణ కుంభమేళా, ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసీ మేడారం జాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. కోరిన కోరికలు తీర్చే వన దేవత సారలమ్మ బుధవారం రాత్రి మేడారం గద్దెపై కొలువుదీరింది. తొలుత కన్నెపల్లి నుంచి మేడారంలో ఉన్న కన్నతల్లి సమ్మక్క చెంతకు సారలమ్మ చేరుకుంది. రాత్రి 10.45 గంటలకు గద్దెలపైకి వచ్చింది. సారలమ్మతోపాటే గంగారం మండలం పూనుగొండ నుంచి పగిడిద్దరాజు, ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజు గద్దెలపైకి చేరారు. ఈ రోజు సమ్మక్క గద్దెలపైకి రానుంది.

సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున మేడారానికి తరలి వస్తున్నారు. సారలమ్మ గద్దెల పైకి చేరడంతో దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. భక్తులతో గద్దెల ప్రాంగణం అంతా కిటకిటలాడిపోతోంది. భక్తుల పుణ్య స్నానాలతో జంపన్న వాగు నిండిపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా తదితర రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ముగ్గురి రాకతో మేడారం వన జాతర వైభవంగా మొదలైంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/