మెడికల్ విద్యార్థి ప్రీతి హెల్త్ బులిటెన్​ను విడుదల చేసిన నిమ్స్ వైద్యులు

కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషియా చదువుతున్న డాక్టర్ ధరావత్ ప్రీతి బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె నిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు. ఈ తరుణంలో ఈమె హెల్త్ బులిటెన్​ను నిమ్స్ వైద్యులు విడుదల చేసారు. ప్రస్తుతం ప్రీతీ ఆరోగ్యం విషమంగానే ఉందని , ఎక్మో వెంటిలేట్​పై చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ప్రీతి కిడ్నీ, గుండె పనితీరు కొంచెం మెరుగ్గా ఉందని తెలిపారు. నిపుణులైన వైద్య బృందం ప్రీతిని నిశితంగా పరిశీలిస్తోందని బులెటిన్ లో పేర్కొన్నారు. మరోపక్క అధికార పార్టీ నేతలు ఈ ఘటన ఫై స్పందిస్తూ..దీనికి కారకులైన వారిని వదిలి పెట్టేది లేదని చెపుతున్నారు.

రెండ్రోజులుగా ప్రాణాల కోసం పోరాడుతున్న ప్రీతిని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పరామర్శించారు. ఆస్పత్రిలో ప్రీతి ఆరోగ్య వివరాలపై ఆరా తీశారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రీతి తల్లిదండ్రులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. అసలు విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడేలా చేసిన పరిస్థితుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ప్రీతి కేఎంసీలో పీజీ (అనస్థీషియా) మొదటి సంవత్సరం చదువుతోంది. శిక్షణలో భాగంగా ఎంజీఎంలో విధులు నిర్వహిస్తోంది. బుధవారం ఉదయం ఎమర్జెన్సీ ఆపరేషన్‌ థియేటర్‌(ఓటీ)లో విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. స్పృహలేని స్థితిలో ఉన్న ఆమెను వెంటనే అక్కడి నుంచి ఎమర్జెన్సీ వార్డులోకి తరలించి, అత్యవసర వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హూటాహుటిన హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రీతి ప్రాణాల కోసం పోరాడుతోంది.