హైదరాబాద్​లో రూపాయికే వైద్యం అందిస్తున్నారు

ప్రస్తుతం హాస్పటల్ లో అడుగుపెడితే జేబులు ఖాళీ అయ్యేవరకూ కాదు..ఆస్తులు అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. చిన్న దెబ్బ తగిలితే పలు రకాల టెస్ట్ లు చేసి..చివరకు చిన్న అయిట్మెంట్ ఇచ్చి పంపుతూ వేలల్లో వసూళ్లు చేస్తున్నారు. ఇంకా ప్రాణం మీదకు వచ్చి వెళ్తే అంతే సంగతి. అలాంటి ఈ రోజుల్లో కేవలం రూపాయికే వైద్యం అందిస్తుండడం..అది కూడా హైదరాబాద్ వంటి మహానగరం లో కావడం విశేషం.

రాంనగర్‌లో డీఎస్​ఆర్ అండ్ డీవీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 పడకల సదుపాయంతో నిర్మించిన జీజీ ఛారిటీ ఆసుపత్రి లో రూపాయికే వైద్యం అందిస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ ఆసుపత్రిని ప్రారంభించగా.. ఓపీ సేవలు, బయటితో పోల్చితే సగం ధరకే నిర్ధారణ పరీక్షలు చేస్తూ, కార్పొరేట్‌ స్థాయిలో సేవలు అందిస్తున్నారు.

ప్రస్తుతం 300-400 మంది రోగులకు ఓపీ సేవలు అందిస్తున్నట్లు ట్రస్ట్‌ ఛైర్మన్‌ గంగాధర గుప్తా తెలిపారు. గైనకాలజిస్ట్‌, పీడియాట్రిక్‌, ఆర్థోపెడిక్‌, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ, యూరాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, జనరల్‌ సర్జన్‌, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించిన ఓపీ సేవలు కేవలం ఒక్క రూపాయికే అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మధుమేహం, బీపీ టెస్ట్‌లు ఉచితం. అల్ట్రాసౌండ్‌, డిజిటల్‌ ఎక్స్‌రే, రక్తపరీక్షలతో పాటు వివిధ రకాల నిర్ధారణ పరీక్షలు 50శాతం రాయితీతో అందిస్తున్నారు. శస్త్రచికిత్సల కోసం వచ్చే పేదలకు ప్రభుత్వ ఆరోగ్య సంక్షేమ పథకాలు వర్తించే వెసులుబాటు ఉంది. రోగులకు, సహాయకులకు ఉదయం అల్పాహారం, రెండు పూటలా భోజనం ఉచితంగా అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ హాస్పటల్ కు రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.