మేయర్ గద్వాల విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఎమ్మెల్సీ కవిత ఫై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల యావత్ బిఆర్ఎస్ శ్రేణులు , కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..పోలీస్ స్టేషన్ లలో పిర్యాదులు చేస్తున్నారు. వెంటనే కవిత కు బండి సంజయ్ బహిరంగ క్షేమపణలు తెలుపాలని డిమాండ్ చేస్తున్నారు. ఉదయం నుండి కూడా అన్ని ప్రాంతాల్లో బండి సంజయ్ కి వ్యతిరేకంగా ర్యాలీలు , దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం వంటివి చేసారు.

ఇదే క్రమంలో బండి సంజయ్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడానికి హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి సహా మహిళా నేతలంతా శనివారం రాజ్ భవన్‌కు చేరుకున్నారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించి ఉన్న పోలీసులు వారిని లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ మహిళా నేతలు రాజ్ భవన్‌ వద్ద ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఎలాంటి అవాంచనీయ సంఘటలు చోటుచేసుకోకుండా మేయర్ విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేసి, స్టేషన్‌కు తరలించారు.

మరోపక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా ఈరోజు ఈడీ ముందుకు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు కవిత ఈడీ ఆఫీస్ లోకి వెళ్లగా..దాదాపు 9 గంటలుగా ఆమెను అధికారులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. మధ్యలో 10 నిముషాలు కవితకు బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈడీ ఆఫీస్ వద్ద పోలీసులు అలర్ట్ అవుతున్నారు. కార్యాలయం వద్ద ఉన్న నేతలను పంపిస్తున్నారు. ఏక్షణమైనా కవిత బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.