జిన్‌పింగ్ పర్యటనతో ఉపయోగం లేదు: ధృవజైశంకర్

నూయార్క్: జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్ పర్యటనకు రావడం ప్రాధాన్యత సంతరించుకుందని, ప్రస్తుతం అన్ని దేశాల చూపు వారిద్దరి భేటీపైనే నిలిచిందని కేంద్ర విదేశాంగ శాఖ మ్తంరి సుబ్రహ్మణ్యం జైశంకర్ కుమారుడు ధృవ జైశంకర్ అన్నారు. మరోవైపు జిన్‌పింగ్ పర్యటన వల్ల భారత్‌కు పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలోపేతం కావడానికి జిన్‌పింగ్ పర్యటన ఉపయోగపడుతుందని అంచనా వేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జిన్ పింగ్ మధ్య చోటు చేసుకునే శిఖరాగ్ర సమావేశం దౌత్య సంబంధాల మీదే ప్రధానంగా కేంద్రీకతమైనట్లు కనిపిస్తుందని చెప్పారు. అమెరికాలోని వాషింగ్టన్ కేంద్రంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్న అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్) డైరెక్టర్‌గా ధృవ జైశంకర్ పని చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల విదేశాంగ విధానాలు, పొరుగు దేశాల మధ్య దౌత్య సంబంధాల పరిశీలన, ఎగ్జిమ్ పాలసీ వంటి అంశాలపై అధ్యయనం చేయడానికి ఈ పరిశోధక సంస్థను ఏర్పాటు చేశారు. ధృవ జైశంకర్ ప్రస్తుతం ఈ సంస్థ డైరెక్టర్‌గా ఉన్నారు.
రెండు దేశాల మధ్య వాణిజ్యపరమైన అంశాలపై విస్తృత చర్చ జరిగే అవకాశాలు ఎంతమాత్రం లేవని, రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యంపై కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయని, ఆయా అంశాలపై చర్చించడానికి రెండు దేశాలు పెద్దగా సుముఖంగా లేవని అన్నారు. భారత్ సహా 16 దేశాలు చైనాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ ప్రతిబంధకాల వల్ల భారత్ ఆర్థికంగా నష్టపోయిందని, ఈ లోటును భర్తీ చేసుకోవడానికి చైనాకు ఎగుమతులను మరిన్ని రంగాలకు విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. భారత్ వ్యవసాయం, ఫార్మాస్యూటికల్స్ రంగానికి చెందిన ఉత్పత్తులను చైనాకు ఎగుమతి చేయడం వల్ల లోటును భర్తీ చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఆసియాలో అత్యంత శక్తిమంతమైన దేశాలుగా గుర్తింపు పొందిన భారత్, చైనాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు ఆశించిన స్థాయిలో లేవన్న విషయం తెలిసిందే. దీన్ని పటిష్టం చేసుకోవడంతో పాటు వాణిజ్య అంశాల్లో సఖ్యత సాధించడానికి తమ వంతు ప్రయత్నాలు చేయాల్సి ఉందని చెప్పారు. చైనా భారత్‌తో కాకుండా పాకిస్థాన్‌తో దౌత్య సంబంధాలు బలోపేతం చేసుకోవాలనుకోవడం ఆందోళనకరమని, ఇందుకు భారత్ కొత్తగా విదేశాంగ విధానాలు, వ్యూహాలను రూపొందించుకోవాలని ఆయన సూచించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..https://www.vaartha.com/news/international-news/