‘క్వారీల ముసుగులో దోచేస్తున్న తెదేపా నేతలు’

Mavoists
Mavoists

‘క్వారీల ముసుగులో దోచేస్తున్న తెదేపా నేతలు’

విశాఖపట్నం: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు కల్లబొల్లి మాటలకు చెప్తున్నారని ఇవన్నీ 2019లో సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడానికే అని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) గాలికొండ ఏరియా కమిటీ ఈస్ట్‌ డివిజన్‌ కార్యదర్శి గోపి ఒకప్రకటనలో తీవ్రంగా ఆరోపించారు. బుధవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన అధికార తెలుగుదేశం పార్టీపైన విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ప్రజా ధనాన్ని, భూములను కొల్లగొట్టి అక్రమాస్తులను కూడగట్టుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల ప్రాణాలు పోయినా లెక్కచేయకుండా గిరిజన ప్రాంతాల్లో పారామిలటరీ, అర్ధసైనిక పోలీసు బలగాలను దింపి ప్రజలను అణిచివేస్తున్నారని, పోలీసులు రాష్ట్ర రాబంధుల్లా మారిపోయారని ఆరోపించారు.

ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవాన్ని పురష్కరించుకొని పాడేరుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏజేన్సీలోని ఆదివాసీ ప్రజల మనుగడకు ముప్పుగా పరిణమించే బాక్సైట్‌, వివిధ లెటరైట్స్‌, గ్రావెల్‌, నాపరాయి వంటి వాటి కోసం తవ్వకాలు లేవంటూనే ఆదివాసీ ప్రజలను నమ్మించారని తెలుగుదేశం పార్టీ మంత్రి అయిన అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, కిడారి సర్వేశ్వరరావు, వారి బంధువులు టీడీపీ నాయకులైన కె.ఎస్‌.ఎన్‌ రాజు, బుక్కా రాజేంద్ర, కమిడి రాంబాబులు ఏజెన్సీలో లెటరైట్‌, నాపరాయి, రంగురాళ్ళ క్వారీలతో ఆదివాసీలకు చెందిన పంట భూములను విధ్వంసం చేయడానికి సిద్ధపడ్డారని ఆయన ఆరోపించారు. ఈ క్వారీలకు వ్యతిరేకంగా ఏజెన్సీలోని గూడెం ప్రాంత ప్రజలు దాదాపు 50 రోజులు పాటు ఆందోళన చేస్తున్నా టీడీపీ నేతలు వారి సేవకులైన పోలీసు అధికారులను రెచ్చగొట్టి గిరిజనులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ముఖ్యంగా విశాఖ డివిజన్‌లో పెద్ద తరహా ఖనిజపు లీజు ఉందని గ్రానైట్‌ క్వారీలతో పాటు 114 మెటల్‌ బిల్డింగ్‌ స్టోన్‌ గ్రావెల్‌ లీజులు ఉన్నాయని అనకాపల్లి డివిజన్‌ పరిధిలో 14 మైనింగ్‌, 314 క్వారీలు ఉన్నాయని ఆరోపించారు. వీటిలో అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా 200 క్యారీలు ఉన్నాయని వీటిలో అత్యధికంగా అనుమతిలేనివే అధికంగా ఉన్నాయన్నారు. వీటివల్ల మార్టూరు, మామిడిపాలెం, మూడిపాలెం, కుంచంగి, వేటజంగాలపాలెం, బవులువాడ, ధర్మసాగర్‌, ఊడేరు, దిబ్బపాలెం గ్రామాల రూపు రేకలు మారిపోయాయని ఆరోపించారు. అనకాపల్లి మండల పరిధిలోని సీతానగరం రెవెన్యూ పరిధిలోని వెంకుపాలెం పంచాయతీ సర్వే నెంబరు 193లో 2.7 ఎకరాల కొండ బోరంబోకు భూమిలో మైనింగ్‌కు సర్వేనెంబరు 251లోని 7.5 హెక్టార్లలో మైనింగ్‌కు నిబంధనలు ఉల్లఘించి యధేచ్ఛగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

రంగురాళ్ళ ముసుగులో అటవులను తవ్వించేందుకు సిద్ధపడ్డారన్నారు. కిడారి సర్వేశ్వరరావుతో పాటు అతని బంధువు బుక్కారాజేంద్ర, టీడీపీ నాయకులు కమిడి రాంబాబులు, హుంకుపేట మండలం రూఢ గ్రామంలో సర్వేనెంబరు 14ః1లో నల్లరాయి క్వారీలో ఇష్టారాజ్యంగా బ్లాస్టింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కారణంగా ఆప్రాంతంలోని 300 ఎకరాల పంట భూములు పాడైపోయాయని అలాగే జీకే వీధి ప్రాంతంలో ఉన్న బ్లాక్‌మెటల్‌ క్వారీలో బ్లాస్టింగ్‌లకు ఉపకరించే కెమికల్‌ వల్ల సమీపంలో ఉన్న చెరువులు కలుషితం అయ్యాయని ఆరోపించారు.

ఈ కారణంగా 2050 ఎకారాల ఆయకట్టుకు సాగునీరు అందని పరిస్థితి దాపురించిందన్నారు. ఈ క్వారీల కారణంగా అనకాపల్లి పరిధిలో 10 మంది, ఏజెన్సీలో మరో ఆరుగురు మృత్యువాత పడ్డారని 5000 ఎకరాల సాగుభూమి పనికి రాకుండా పోయిందని ఆరోపించారు. ఇవే కాకుండా జిల్లాలో మరో 90 క్వారీలకు గ్రీన్‌ సిగ్నెల్‌ లభించిందని అవే గాని ప్రారంభం అయితే మన్యం ఆదివాసీ ప్రజల జీవితాలు బుగ్గిపాలవుతాయన్నారు. తక్షణమే వీటిని రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. ఇదే కాకుండా ఆదివాసీ ప్రాంతంలో డెంగ్యూ మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిందని వందకు పైగానే గిరిజనులు మృతి చెందారన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల లెక్కల ప్రకారం 290 మలేరియా, 11వందలు టైఫాయిడ్‌, 21,800 డయేరియా, 1660 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ మన్యంలో వైద్యుల వద్ద సరైన మందులు అందుబాటులో లేకపోవడంతో ఆదివాసీల ప్రజల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయన్నారు.

గిరిజనుల ఆరోగ్యాన్ని పట్టించుకునే నాధుడే కరువయ్యాడన్నారు. ఆదివాసీ చట్టాలను కాలరాస్తున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ నేతలు మన్యం ద్రోహులైన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మణికుమారి, ఎంవివి ప్రసాద్‌, నాగరాజు, అయ్యన్నపాత్రుడు తదితరులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. విదేశీ కంపెనీలకు గిరి సంపద దారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. నాడు బ్రిటీషర్లు దేశాన్ని దోచుకుంటే నేడు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు దేశాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు.

అధికార టీడీపీ, బీజేపీ నేతల ఇళ్ళను మన్యం ప్రజలు ముట్టడించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివాసీ జీవితాలతో ఆడుకుంటున్న అయ్యన్నపాత్రుడు, గిడ్డి ఈశ్వరి, రాంబాబు, రాజేంద్ర, పీలా గోవింద్‌, నాగరాజు, ప్రసాద్‌, మణికుమారిలను మన్యం నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ అడవిపై హక్కు ఆదీవాసీలకే ఉంటుందని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు. ఆదివాసీలపై జరుగుతున్న ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ మూడవ దశలో భాగంగా యువత, మేధావులు తమ సహాయ సహకారాలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఏజెన్సీలో పని చేస్తున్న సిఐలు, ఎస్‌ఐలు పోలీసు గూండాల్లా వ్యవహరిస్తూ గిరిజన హక్కులను కాలరాస్తున్నారిని ఆరోపించారు. అమాయకులను నిర్భంధించి చిత్ర హింసలకు గురిస్తూ వారికి చెందిన రేషన్‌ కార్డులు, ఆధార్‌కార్డులను స్వాధీనం చేసుకొని రోజూ స్టేషన్‌కు రావాలంటూ హుక్కుం రాజీ చేస్తున్నారన్నారు.

దేవరపల్లి పంచాయతీకి చెందిన పాంగి లక్ష్మణరావు, పాంగి కామేష్‌లను నిర్భందించి లొంగుబాటుగా చూపించారని అలాగే భానుప్రసాద్‌ను 2017 నవంబర్‌లో పట్టుకొని నిర్భంధించి నెల రోజుల కిందట లొంగుబాటుగా చూపించారని ఆయన ఆరోపించారు. పోలీసు దాడులు ఆపక పోతే మన్యం ద్రోహులైన టీడీపీ, బీజేపీ నాయకులు, పోలీసు అధికారులు ప్రజాగ్రహానికి గురి కాక తప్పదని సీపీఐ మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ కార్యదర్శి గోపి విడుదల చేసిన ప్రకటనలో హెచ్చరించారు.