భారీగా తగ్గిన వాణిజ్యలోటు
బంగారం అమ్మకాలపై ప్రభావం

New Delhi: బంగారం దిగుమతులు ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జులై త్రైమాసికంలో 81.22శాతం తగ్గి 2.47బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
కరోనా మహమ్మారి నేపథ్యంలో డిమాండ్ తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని వాణిజ్య శాఖ గణాంకాలు స్పష్టంచేశాయి.
2019-20 ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో బంగారం దిగుమతులు 13.16బిలియన్ డాలర్లుగా ఉంది.
అంటే గత ఏడాది రూ.91వేల కోట్లకుపైగా ఉంది. బంగారం, వెండి ధరలు ఇటీవలి వరకు భారీగా పెరిగాయి. గతవారం నుంచి తగ్గుముఖం పట్టిన విషయం విదితమే.
దీంతో అమ్మకాలపై ప్రభావం పడింది. ధరలు తగ్గిన నేపథ్యంలో తిరిగి పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.
అయితే గత త్రైమాసికంలో పసిడి ధరలు చుక్కలను తాకడంతో డిమాండ్ పడిపోయింది.
బంగారం దిగుమతులు 81 శాతానికిపైగా తగ్గితే, వెండి దిగుమతులు గత 4 నెలల్లో 56.5శాతం క్షీణించి, దాదాపు రూ.5185కోట్లకు తగ్గాయి.
గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ 4 నెలల్లో వాణిజ్యలోటు 5,940 కోట్ల డాలర్ల నుంచి 1395కోట్ల డాలర్లకు తగ్గింది.
గత ఏడాది డిసెంబరు నుంచి పసిడి దిగుమతులు పడిపోతున్నాయి. మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వరుసగా 62.6శాతం, 99.93శాతం, 98.4శాతం, 77.5శాతం చొప్పున పడిపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి ధర 2000డాలర్ల దిగువన ఉంది.
ఆగస్టు మొదటి వారంలో 2000 డాలర్లపైకి చేరుకుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఆభరణాల కొనుగోళ్లు తగ్గాయి.
ఈ ప్రభావం మన దేశ ఆభరణాల ఎగుమతులపైనా కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జులైతో పోలిస్తే ఈ సారి మన దేశం నుంచి ఆభరణాల ఎగుమతులు 66.36శాతం తగ్గి 417 కోట్ల డాలర్లకు క్షీణించాయి.
జులైలో కూడా పసిడి ఎక్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లలోకి పెట్టుబడులు భారీగా వచ్చాయి. జూన్ నెలతో పోలిస్తే పసిడి ఈటిఎఫ్‌లలోకి పెట్టుబడులు 86శాతం పెరగడం విశేషం.
బంగారం ధరలు పెరుగుతుండడంతో కొత్త ఇన్వెస్టర్లు పసిడిని తమ పోర్ట్‌ఫోలియోల్లోకి చేర్చుకోవడానికి ఆసక్తి కనబరిచారు.
యాంఫీ లెక్కల ప్రకారం జనవరి నుంచి జులై వరకు ఇటిఎఫ్‌ల్లోకి రూ.4452కోట్ల పెట్టుబడులు వచ్చాయి. బులియన్ ర్యాలీకి తోడు స్టాక్ మార్కెట్లలో ఆటుపోట్లు కలిసి వస్తున్నాయి.
24 నుంచి ఎంసిఎక్స్‌లో తొలి బులియన్ సూచి
దేశంలోని మొట్టమొదటి బులియన్ సూచి బుల్‌డెక్స్‌ను ఈ నెల 24వ తేదీ నుంచి మల్టీ కమోడిటీ ఎక్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎంసిఎక్స్) ప్రారంభించనుంది.
24వ తేదీ నుంచి సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో గడువు పూర్తయ్యే ఎంసిఎక్స్ ఐకామ్‌డెక్స్ బులియన్ ఇండెక్స్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ట్రేడింగ్ ప్రారంభం కానుందని ఎంసిఎక్స్ తెలిపింది.
ఎంసిఎక్స్ బుల్‌డెక్స్ బులియన్ విభాగంలో అందిస్తున్న ఆరో ఉత్పత్తి. తద్వారా బులియన్ మార్కెట్లోని జోష్‌ను క్యాష్ చేసుకునేందుకు ఎంసిఎక్స్ సిద్ధమైంది.
బుల్‌డెక్స్ పేరుతో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌లో బులియన్ సూచీని ప్రవేశపెడుతోంది.
మన దేశంలో బంగారం, వెండి ట్రేడింగ్ కోసం ఇలా ఒక సూచీని ప్రవేశపెట్టడం ఇదే మొదటి సారి.
బులియన్ మార్కెట్లో కిలో బంగారం, 100 గ్రాముల గోల్డ్ మినీ, 8 గ్రాముల గోల్డ్ గినియా, ఒక గ్రామ్ గోల్డ్ పెటా ఉంది. కిలో బంగారంపై ఫ్యూచర్ ఆప్షన్ ఇప్పటికే అందుబాటులో ఉంది.
100 గ్రాముల గోల్డ్ మినీ కాంట్రాక్టులో ఆప్షన్స్‌ను ఇటీవల ప్రారంభించింది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/