పుంజుకున్న మారుతి విక్ర‌యాలు

maruti-suzuki
maruti-suzuki

ముంబయి: కరోనా నేపథ్యంలో సుమారు మూడు నెల‌ల‌పాటు నిలిచిపోయిన వాహన విక్రయాలు క్రమంగా జోరందుకుంటున్నాయి. మారుతీ సుజుకీ ఇండియా కూడా విక్రయాల్లో భారీ వృద్ధి నమోదైనట్లు ఓ ప్రకటనలో తెలిపింది. జూలైలో 1,08,064 యూనిట్లు అమ్ముడైనట్లు వెల్లడించింది. క‌రోనాకు ముందు నమోదైన విక్రయాలతో పోలిస్తే ఇంకా పుంజుకోవాల్సి ఉన్నా.. 2019 జూలైతో పోలిస్తే కేవలం 1.1 శాతం మాత్రమే అమ్మ‌కాలు త‌గ్గాయ‌ని పేర్కొన్న‌ది. అయితే అంత‌కుముందు నె‌ల‌తో పోలిస్తే మాత్రం 88.2 శాతం అమ్మకాలు పెరిగాయ‌ని తెలిపింది.

కాగా, ఆల్టో, ఎస్‌ప్రెసో వంటి మినీ సెగ్మెంట్లో విక్రయాలు పెరగడం భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తున్నట్లు మారుతీ సంస్థ‌ తెలిపింది. జూలైలో ఆల్టో, ఎస్‌ప్రెసో కలిపి 17,258 యూనిట్లు అమ్ముడైనట్లు వెల్లడించింది. ఎస్‌ప్రెసో గత సెప్టెంబర్‌లోనే విడుదలైనప్పటికీ అమ్మకాల విషయంలో మినీ సెగ్మెంట్లో మిగతా వాటితో పోటీ పడుతోందని తెలిపింది. ఇక ‘యుటిలిటీ వెహికల్ (యూవీ)’ విభాగంలో 19,177 యూనిట్లు అమ్మకాలు జరిగినట్టు పేర్కొన్న‌ది. 12 నెలల క్రితం విక్రయాలతో పోలిస్తే ఇది 26.3 శాతం ఎక్కువ‌ని వెల్ల‌డించింది. ఈ కేటగిరీలో ఎర్టిగా, విటారా బ్రెజా, ఎక్స్‌ఎల్‌6 వంటి కార్లు ఉన్నాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/