ఈ నెల 25 న బిజెపి కండువా కప్పుకోబోతున్న మర్రి శశిధర్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ రాజకీయ నేత మర్రి శశిధర్ రెడ్డి..ఈ నెల 25 న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బిజెపి లో చేరనున్నారు. ఈ క్రమంలో రేపు (గురువారం) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితర నేతలతో కలిసి మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మర్రి శశిధర్ రెడ్డి..రేవంత్ రెడ్డి ఫై నిప్పులు చెరిగారు. బాధగానే కాంగ్రెస్‌తో బంధం తెంచుకుంటున్నానన్నారు. ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించడంలో కాంగ్రెస్‌ విఫలమైందన్నారు. పార్టీ ముఖ్య నాయకురాలు సోనియా గాంధీకి కూడా లేఖ రాశానని మర్రి శశిధర్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో ఇలాంటి పరిస్థితిని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. పార్టీలో పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోందన్నారు. ప్రజల కోసం పని చేయడంలో కాంగ్రెస్‌ పార్టీ విఫలమైందన్నారు. కాంగ్రెస్‌కు చేతి గుర్తు సూచించిన వారిలో తన కూడా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నానని, ఇలాంటి పరిస్ధితి వస్తుందని తాను ఊహించలేదన్నారు. పీసీసీ చీఫ్‌లకు ఇంఛార్జ్‌లు ఏజెంట్‌లుగా మారిపోయారని, ఇదే కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్ అని శశిధర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.