జియోలో ఫేస్‌బుక్‌ వాటాల కొనుగోలుపై స్పందించిన మార్క్‌

జియో, ఫేస్‌బుక్ కలిసి సరికొత్త మార్గాలను అన్వేషిస్తాయి..మార్క్ జూకర్‌బర్గ్

mukesh ambani-mark zuckerberg
mukesh ambani-mark zuckerberg

అమెరికా: ప్రముఖ టెలికం రంగం జియోలో 9.99శాతం వాటాను ఫేస్‌బుక్‌ కొనుగోలు చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఈవిషయంపై ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జూకర్‌బర్గ్ స్పందించారు. భారత్‌లో జియోతో ఫేస్‌బుక్ జత కట్టిందని, ప్రజలు, వ్యాపారం కోసం జియో, ఫేస్‌బుక్ కలిసి సరికొత్త మార్గాలను అన్వేషిస్తాయని వెల్లడించారు. కీలక ప్రాజెక్టుల్లో ఈ సంస్థలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. ఫేస్‌బుక్ పోస్టులో ‘తమ బంధంతో దేశంలోని ప్రజలకు ఆర్థిక అవకాశాలు మెరుగవుతాయి. డిజిటల్ ఎకనామీ అభివృద్ధికి తమ బంధం దోహదం చేస్తుంది. ఇప్పటికే ఫేస్‌బుక్, వాట్సాప్‌‌లో భారతీయుల పాత్ర చాలా పెద్దది. భారత్‌ డిజిటల్ దిశగా వేగంగా ప్రయాణం సాగిస్తోంది. చిన్న వ్యాపారాలు ఆన్‌లైన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ మార్పులో జియో పాత్ర అత్యంత కీలకం’ అని జూకర్‌బర్గ్ తెలిపారు. భారత్‌లో 6 కోట్ల చిన్న వ్యాపారాలు ఉన్నాయని, మిలియన్ల మంది వాటిపై ఆధారాపడి బతుకుతున్నారని మార్క్ జూకర్‌బర్గ్ తెలిపారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/