మావోయిస్టు రామన్న భార్య సావిత్రి లొంగుబాటు..

మావోయిస్టులకు భారీ షాక్‌ తగిలింది. మావోయిస్టు సావిత్రి పోలీసుల ఎదుట లొంగిపోయింది. తెలంగాణలో మళ్లీ పుంజుకోవాలని చూస్తున్న మావోయిస్టు మూలాలను తుడిచిపెట్టేందుకు పోలీస్ యంత్రాంగం శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఏవోబీలో 700 మంది సానభూతిపరులు లొంగిపోగా.. తాజాగా తెలంగాణలో మావోయిస్టు అగ్రనేత భార్య సావిత్రి లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల ముందు మావోయిస్టు అగ్రనేత రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న భార్య సావిత్రి లొంగిపోయారు. ఈరోజు సాయంత్రం డీజీపీ మహేందర్ రెడ్డి సమక్షంలో ఆమె మీడియా ఎదుటకు రానున్నట్లు అధికారులు తెలిపారు.

2019లో ఛత్తీస్‌గఢ్‌ అడువుల్లో రామన్న గుండెపోటు కారణంగా మృతి చెందాడు. రామన్నపై గతంలో పోలీసులు రూ.40లక్షల రివార్డును ప్రకటించారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఝార్కండ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌గా రామన్న ఉన్నాడు. 1994లో దళ సభ్యురాలు సావిత్రిని రామన్న పెళ్లి చేసుకున్నాడు. సావిత్రి కుమారుడు రంజిత్‌ గతేడాది పోలీసులకు లొంగిపోయాడు. ఆ తర్వాత సావిత్రి సైతం మావోయిస్ట్‌ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నది.