మణిపూర్‌లో విషాదం : ఆర్మీ బేస్ క్యాంప్‌పై విరిగిపడ్డ కొండచరియలు..

మణిపూర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. నోనీ జిల్లాలో భారీ కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, 45 మంది గల్లంతయ్యారు. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పెద్ద మొత్తంలో విరిగిపడిన బండరాళ్లు.. ఆర్మీ బేస్ క్యాంప్‌లోని జవాన్లు, ఇతర సిబ్బందిని చిదిమేస్తూ లోయ భాగంలోని ప్రవాహంలో పడిపోయాయి. బండరాళ్లతో పాటు ప్రవాహంలో మట్టి చరియలు విరిగిపడటంతో బురదమయంగా మారింది. మృతదేహాలు ఆ బురదలో కూరుకుపోయాయి.

బురదలో నుంచి ఏడు మృతదేహాలను బయటకు తీశారు. 19 మందిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరో 45 మంది గల్లంతయ్యారు. నోనె సమీపంలో మెగా ట్రెయిన్ ప్రాజెక్ట్ సైట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈశాన్య రాష్ట్రాలను కలిపే అతిపెద్ద రైల్వే లైన్ ప్రాజెక్టు ఇక్కడ నిర్మాణంలో ఉంది. అయితే, వివిధ వర్గాల నుంచి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పనులకు అంతరాయం కలుగకుండా సైట్ వద్ద భద్రతా బలగాలను మోహరించారు. జిరిబామ్ నుంచి ఇంఫాల్ వరకు రైల్వే లైన్ నిర్మాణంలో ఉంది. దీని రక్షణ కోసం టుపుల్ రైల్వే స్టేషన్ సమీపంలో 107 టెరిటోరియల్ ఆర్మీ బేస్‌ క్యాంప్‌ని ఏర్పాటు చేశారు. కాగా బుధవారం అర్ధరాత్రి సమయంలో ఆ బేస్‌ క్యాంప్‌పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు.