హాకీ కెప్టెన్‌ మన్‌ప్రీత్‌కు అవమానం

Manpreet Singh
Manpreet Singh

టీమిండియా హాకీ కెప్టెన్‌ మన్‌ప్రీత్‌కు అవమానం

భువనేశ్వర్‌ : టీమిండియా హాకీ కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌కు ఘెర అవమానం ఎదురైంది. కళింగ మైదానంలో కెనడా-నెదర్లాండ్స్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌ చూసేందుకు జట్టు సభ్యులతో కలిసి విఐపి లాంజ్‌లోకి వెళ్లిన కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సెల్ఫీలు తీసుకున్నాడు. అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. ఇది గమనించిన హాకీ ఇండియా సిఇఒ ఎలెనా నార్మన్‌ గట్టిగా అరుస్తూ వెంటనే అక్కడి నుంచి రావాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడికి వెళ్లడానికి మీకెంత ధైర్యం అని ప్రశ్నిస్తూనే నోరు మూసుకుని వెళ్లాలంటూ హుకుం జారీ చేశారు. నిజానికి టోర్నీ నిబంధనల ప్రకారం విఐపి లాంజ్‌లోకి వెళ్లడం నిషేధం కావడంతో మన్‌ప్రీత్‌ మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెనక్కి వచ్చాడు. ఈ ఘటనపై మన్‌ప్రీత్‌ మాట్లాడుతూ.. గొడవ మరింత పెరగకుండా జాగ్రత్త పడ్డాడు. అక్కడికి వెళ్లడం తమ తప్పేనని అంగీకరించాడు. ఆటగాళ్లు ఎవరూ అక్కడికి వెళ్లడానికి లేదు. మేం అక్కడికి వెళ్లి పొరపాటు చేశాం. ఇదేమంత పెద్ద తప్పుకాదు. రేపు ఉదయం నిద్రలేచాక ఈ విషయం అసలు గుర్తే ఉండదు. అని పేర్కొన్నాడు. ఇలా చెప్పాలంటూ నాపై ఎవరి ఒత్తిడీ లేదు. ఇలానే చెప్పాలని నాకెవరూ చెప్పలేదు. ఎలెనాతో వ్యక్తిగతంగా నాకెటువంటి గొడవలు లేవు. ఆమె నాకు మంచి స్నేహితురాలు. అయితే, ఎలెనా తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని ఇలా పదిమంది ముందు అరవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అక్కడ ఎందరో ప్రముఖులు, అర్జున అవార్డు గ్రహితలు ఉన్నారన్న విషయాన్ని మరిచి ఆ అరుపులు ఏంటంటూ విరుకుపడుతున్నారు.