మణిపూర్‌ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్‌ ఏర్పాటు

మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్న తెలుగు విద్యార్థుల కోసం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హెల్ప్‌లైన్‌తోపాటు కంట్రోల్‌రూమ్‌ను ఏర్పటు చేసారు. ఈ నెల 3న చురచంద్‌పూర్ జిల్లా టోర్‌బంగ్ ప్రాంతంలో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మణిపూర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెలుగు విద్యార్థులంతా బిక్కుబిక్కుమంటూ గదులకే పరిమితమవ్వాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. తెలుగు విద్యార్థులను, పౌరుల కోసం హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు.

మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో ఆ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ పౌరులను రాష్ట్రానికి రప్పించేందుకు ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. మరోపక్క ఏపీ విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌లైన్‌తోపాటు కంట్రోల్‌రూమ్‌ను ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఏర్పాటుచేసింది. 011-23384016, 011-23387089 హెల్ప్‌లైన్‌ నెంబర్లను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. విద్యార్థులకు అన్ని రకాల సహాయాలను అందించేందుకు మణిపూర్‌ ప్రభుత్వంతో పాటు స్థానిక అధికారులతో నిరంతరం అందుబాటులో ఉంటున్నట్లు పేర్కొంది. హెల్ప్‌లైన్‌ నెంబర్ల ద్వారా ఢిల్లీలోని ఎపి భవన్‌ను సంప్రదించి అవసరమైన సహాయం పొందాలని కోరారు.