మాండూస్ ఎఫెక్ట్ : ఏపీలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు

mandous cyclone in ap

మాండూస్ ఎఫెక్ట్ ఏపీ ఫై తీవ్రంగా పడుతుంది. రాత్రి నుండి ఏపీలోని పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రాత్రి 1:30 గంటలకు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తుఫాన్ తీరం దాటింది. సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. రేపు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటినప్పటికీ రేపటి వరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు సూచించారు.

తీరం వెంబడి గంటకు 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కోస్తా, రాయలసీమల్లోని పలు చోట్ల చిరు జల్లులు కురుస్తున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో అత్యధికంగా 125.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, తిరుపతి జిల్లా నాయుడుపేటలో 114 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెనుగాలుల కారణంగా చెన్నైలో చెట్లు విరిగాయి. చెన్నై నుంచి నడవాల్సిన 27 విమానాలు నిన్న రద్దయ్యాయి. చెన్నైతోపాటు తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని 5 జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అలాగే, వర్షం కారణంగా నిన్న పూణె-రేణిగుంట-హైదరాబాద్ స్పైస్‌జెట్ విమానం రద్దయింది.