మంధాన మెరిసినా తప్పని ఓటమి

మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఓడిన భారత్‌

Smriti Mandhana
Smriti Mandhana

మెల్‌బోర్న్: మొన్న అండర్19.. నిన్న సీనియర్ పురుషుల టీమ్.. నేడు మహిళల జట్టు ఓటమిపాలవ్వడం భారత అభిమానులను తీవ్రంగా బాధిస్తోంది. బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్లో యువ భారత్ ఒత్తిడిని జయించలేక చేతులెత్తేస్తే.. వరుస వన్డేల్లో ఓడి 30 క్లీన్ స్వీప్ అయిన కోహ్లీసేన చెత్త రికార్డును మూటగట్టుకుంది. తాజాగా మహిళల టీ20 ప్రపంచకప్ ముందు సన్నాహకంగా జరిగిన ముక్కోణపు టీ20 టోర్నమెంట్‌ ఫైనల్లో భారత్ మహిళలు ఓటమి చవిచూశారు. బుధవారం జరిగిన ఈ ఫైనల్లో ఆతిథ్య ఆస్ట్రేలియా 11 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ బెత్ మూనీ (71 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగింది. భారత బౌలర్లలో దీపిక శర్మ, రాజేశ్వరి గైక్వాడ్ రెండేసి వికెట్లు తీయగా.. హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి, రాధా యాదవ్ తలో వికెట్ తీశారు. అనంతరం ఆసీస్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్ నిర్ణీత ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. ఓపెనర్ స్మృతి మంధాన 66 పరుగులతో రాణించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/