మొత్తానికి తన కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన మంచు మనోజ్

ఎట్టకేలకు మంచు మనోజ్ ఈరోజు తన కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించి అభిమానులను సంతోష పెట్టారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడి గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన మంచు మనోజ్..తనదైన యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ వచ్చాడు. 2004లో దొంగ దొంగది సినిమాతో హీరోగా పరిచయమైన మనోజ్.. ఆ తర్వాత బిందాస్ చిత్రంతో నంది అవార్డ్ అందుకున్నారు. తర్వాత వేదం, ఝుమ్మంది నాదం, కరెంట్ తీగ, రాజు భాయ్ వంటి చిత్రాలతో మెప్పించారు. ఆ తర్వాత పలు ప్లాప్స్ పడేసరికి సినిమాలకు దూరమయ్యాడు. అలాగే సోషల్ మీడియా లోను యాక్టివ్ గా ఉండడం లేదు. ఈ మధ్య రెండో పెళ్లి తో మళ్లీ వార్తల్లో నిలిచాడు.

రెండు రోజుల క్రితం సడెన్ గా ఓ ట్వీట్ చేసి మీడియా లో మాట్లాడుకునేలా చేసాడు. “ఈ విషయం చాలా రోజులుగా నా మనసులోనే దాచుకున్నాను.. నా జీవితంలోని మరో దశలోకి ప్రవేశించడానికి సంతోషిస్తున్నాను.. అదేంటో 20 జనవరి 2023న ప్రకటిస్తాను.. నాకు ఎప్పటిలాగే మీ అందరి ఆశీస్సులు కావాలి”.. అంటూ ట్వీట్ చేశారు మనోజ్. దీంతో మనోజ్ తదుపరి ప్రాజెక్ట్ గురించి చెప్పుతున్నారా ?.. లేదా సెకండ్ మ్యారెజ్ అనౌన్స్ చేయబోతున్నారా ? అంటూ అభిమానులు , సినీ ప్రముఖులు ఆసక్తిగా ఎదురుచూడడం మొదలుపెట్టారు. ఇక ఈరోజు ఆ ట్వీట్ చేసి అందరి ఎదురుచూపులు తెరదించారు.

ఆరేళ్ల బ్రేక్ తర్వాత మనోజ్ తన కొత్త సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు ‘వాట్ ది ఫిష్’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి వరుణ్ కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్.. సినిమా గురించిన కీలక అంశాలను వెల్లడించారు మనోజ్. ఈ పోస్టర్‌లో మనోజ్ చాలా మంది తెలియని వ్యక్తులను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇక మనోజ్ బ్యాక్ పోజ్‌లో చాలా ఫిట్‌గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో తను కొత్త గెటప్‌లో కనిపించనుండగా.. ‘మనం మనం బరంపురం’ అనే ట్యాగ్ లైన్ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. మరి ఈ సినిమాను ఎప్పుడు మొదలుపెడతారో..ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారో చూడాలి.