ఆప్‌ మంత్రి సత్యేందర్‌ జైన్‌ మసాజ్‌ అంశంలో మరో ట్విస్ట్‌

అతడు ఫిజియోథెరపిస్ట్‌ కాదు..లైంగిక దాడి కేసులో నిందితుడు

Man massaging Satyendra Jain in jail, a rape convict: Tihar sources

న్యూఢిల్లీః ఆప్‌ మంత్రి సత్యేందర్‌ జైన్‌ జైల్లో మసాజ్‌ వ్యవహారం మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. మంత్రి మసాజ్‌ చేసింది ఫిజియోథెరపిస్ట్‌ అని ఆప్‌ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, మంత్రికి మసాజ్‌ చేసింది ఫిజియోథెరపిస్ట్‌ కాదని.. పోక్సో యాక్ట్‌ కింద శిక్ష అనుభవిస్తున్న నిందితుడు రింకూ అని తీహార్‌ జైలు అధికార వర్గాలు చెప్పినట్లు సమాచారం. రింకూ లైంగిక దాడి కేసులో నిందితుడని, పోక్సో చట్టంలోని సెక్షన్ 6, ఐపీసీ 376, 506, 509 కింద అభియోగాలు నమోదయ్యాయని పేర్కొన్నారు.

మరో వైపు సత్యేందర్‌ జైన్‌కు మసాజ్‌ చేసింది రేపిస్ట్‌ అని బీజేపీ నేత షాజాద్‌ పూనావాలా ట్వీట్‌ చేశారు. అతను ఫిజియోథెరపిస్ట్‌ కాదని.. రేపిస్ట్‌ అని ఆరోపించారు. వారు నిజంగా తీహార్‌ను థాయ్‌లాండ్‌గా మార్యారని విమర్శించారు. సత్యేందర్‌ జైన్‌ను బర్తరఫ్‌ చేయాలని, అవినీతిని సమర్థించడం ఆపాలన్నారు. మరో వైపు కాంగ్రెస్‌ నేత అల్కా లాంబ ఆప్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. అమ్మాయిలపై లైంగిక దాడి చేసే వారితో సేవలు చేయించుకుంటున్నారని, ఆ తర్వాత వారిని రక్షిస్తారని ఆరోపించారు.

ఇదిలా ఉండగా.. తీహార్‌ జైలులో సత్యేందర్‌ జైన్‌ బ్యారక్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఫుటేజీలో ఓ వ్యక్తి సత్యేందర్‌ జైన్‌ పాదాలకు మసాజ్‌ చేస్తూ కనిపించాడు. ఈ ఫుటేజీని ఈడీ కోర్టుకు సైతం అందించేసిన విషయం తెలిసిందే. సత్యేందర్‌ జైన్‌ తీహార్‌లోని ఏడో నెంబర్‌ జైలులో ఉన్నారు. సత్యేందర్ జైన్‌కు సౌకర్యాలు కల్పించినందుకు జైలు సూపరింటెండెంట్‌తో సహా నలుగురు జైలు అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/