గౌలిగౌడలో పేలుడు కలకలం

గౌలిగౌడలో పేలుడు కలకలం రేపింది. రసాయనాలను నాలాలో పోస్తున్న సమయంలో పేలుడు చోటు చేసుకోవడం తో ఓ వ్యక్తి చనిపోగా , మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒక్కసారిగా పేలుడు జరుగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ప్రమాదంలో భరత్‌ అనే వ్యక్తి మృతి చెందగా.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

భరత్‌ కెమికల్స్ వ్యాపారం చేస్తుండగా.. కాలం చెల్లిన కెమిల్స్‌ను ఇంటి ఎదుట ఉన్న నాలాలో పారబోస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం సైతం భరత్‌ కెమికల్స్‌ను నాలాలో పారపోశాడు. ఆ తర్వాత నాలాలో ఇనుప చువ్వ సహాయంతో రసాయనాలను కదిలించాడు. దీంతో ఒక్కసారిగా పేలుడు చోటు చేసుకున్నది. పేలుడు ధాటికి భరత్‌ ఎగిరిపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతని తండ్రి వేణుగోపాల్‌తో పాటు మరో వ్యక్తి గాయాలయ్యాయి. పేలుడు ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.