మనిషి – దేవుడు

ఆధ్యాత్మిక చింతన

Sun Rises
Sun Rises

దేవుడు మనకు కనిపిస్తాడా? ఈ ప్రశ్న ప్రతి ఆస్తికుడి మనసులో ఎప్పుడో ఒకప్పుడు ఉదయించక మానదు. దానికి సమాధానం దొరక్కా మానదు.

హనుమంతుడికీ, పాండవులకీ, ప్రహ్లాదుడికి, రామదాసుకీ, త్యాగయ్యకీ, ఇలా ఎందరెందరికో భగవంతుడు దర్శనమిచ్చాడంటారు. అభయమిచ్చాడని, ఆదుకున్నాడని చెబుతారు. యద్భావం తద్భవతి అన్నట్లు ఎలా కోరుకుంటే అలా కనిపించాడు.

దైవమనేది ఓ మహాద్భుత శక్తి కేంద్రం. అనంతకోటి నామధేయుడు దేవుడు.

అష్టోత్తర, శత, సహస్రోత్తర నామావళి సోత్రాలు మాత్రమే కాదు, పవిత్రత, సత్యం, సత్సంగం సంస్కారం, సహకారం, సన్మార్గం, సదాశయం మానవత్వం, క్షమ, ప్రేమ, జ్ఞానం, సంతోషం, కరుణ, ధర్మం దానం, అహింస, శాంతి, ఇలా ఎన్నెన్నో లెక్క మించిన పర్యాయపదాలు ఉన్నాయి దైవానికి.

మరి వీటిలో ఏదో ఒకటి ఎక్కడో అక్కడ చూస్తూనే ఉన్నాం కదా. ఎవరో ఒకరిలో పైన చెప్పిన సుగుణమేదో ఒకటైనా కనిపిస్తూనే ఉంది కదా! అలా కనిపించడమంటే మనకు దైవదర్శనమైందన్న మాటే. మనకిప్పుడు దశావతారాల రూపాల్లో కనిపించడు దేవుడు.

మనం పైన చెప్పుకొన్న దివ్యగుణాలన్నీ దైవానికి ప్రతిరూపాలే. ఈ గుణాలను మనలో ఓ వైపు పెంచుకుంటూ ఇతరుల్లో ఆ గుణాలనే దర్శించాలి.

ఇతరుల్లోని లోపాలు పాపాలు వెతకడమంటే మనలోపాలను పాపాలను పెంచుకునేందుకు సన్నద్ధమైనట్లే. అందుకే సంత్‌కబీర్‌దాస్‌ అంటాడు.

ప్రపంచంలో చెడ్డవాడికోసం వెదికాను. ఎక్కడి దొరకలేదు. చివరికి నా మనసులో వెదికితే నన్ను మించిన చెడ్డవాడు లేడనిపించింది

అని. యోగులు, మహర్షులు, పౌరాణికులు, ఎవరైనా ఎదుటివారి లోపాలు, దోషాలు గురించి ముచ్చటిస్తున్నరా? హంస పాలను స్వీకరించి నీటిని వదిలిపెట్టినట్లు ఆమాత్రం సామాన్య గుణాన్ని అలవుచుకుంటే దైవత్వం ఇంక కనిపించని చోటుంటుందా?

ఈ కలియుంలో కేవలం నామస్మరణం చేసినంత మాత్రాన ముక్తి భిస్తుందన్నారు కదా. ఇది మానవజాతికి ఎంత గొప్పవరం. మనమనుకున్నది జరగదు.

అనుకోనిది జరుగుతుంది. కాలచక్రం మన చేతిలో లేదు.

జనన మరణాలు మన ఆధీనంలో లేవు. మరెందుకీ అహం? అందుకే వీటన్నింటికీ మూలకారకుడైన ఆ దైవం పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. తననే పూజింపమని ఆయన కోరలేదు. మంచి ఎక్కడుంటే అక్కడ ఉన్నానన్నాడు.

ఆ మంచినే పూజిద్దాం, గౌరవిద్దాం. నైతికవర్తన, పాపభీతి ఉన్నచోటల్లా మంచితనం, మానవత్వం స్థిరంగా, శాశ్వతంగా ఉంటాయి. ప్రధానంగా వీటిపైన విశ్వాసం కలగాలి.

దేహమంటేనే సందేహాలపుట్ట. జ్ఞానం వల్ల సందేహాం తొలగిపోతుంది.

గీతాకారుడు కృష్ణపరమాత్మే అన్నాడు కదా. ఇహంలోను, పరంలోను సుఖశాంతులు పొందలేడు. కస్తూరి పరిమళాన్ని తన నాభిలోనే ఉంచుకున్న లేడి ఆ సుగంధం కోసం ఏ గడ్డిలోనో వెదకడం వంటి మూర్ఖత్వానికి దాసోహంటున్నాం కదా మనం.

శబ్ధార్ధాలవలె ప్రకృతి పరమాత్మ కలిసే ఉన్నారు. ఒకనాణేనికి ఉన్న బొమ్మబొరుసులు వీరు. ప్రకృతిలో సర్వత్రా సౌందర్యాన్ని చూడగిలిగేవాడు సత్యం శివం సుందరాన్ని సర్వదా దర్శించగలరని గ్రహించాలి.

దైవదర్శనం చేసుకునేందుకు మన సనాతన ధర్మం ఎన్ని సులువైన మెలకువలు తెలిపింది? సత్యం ధర్మం న్యాయం పరోపకారం మనో నిగ్రహం పురాణ శ్రవణం, సత్సాంగత్యం. దైవనామస్మరణం, ఇలాంటివి అలవరచుకోమన్నది.

ఇవన్నీ మన దైనందిన జీవనంలోని అతి ప్రధానమైన అంశాలే. వీటిని వేరుచేసి జీవిస్తూన్నాం. కాదు జీవన వ్యాపారం కొనసాగిస్తున్నాం. మనకు దైవదర్శనం ఎలా కలుగుతుంది.

బాంధవ్యాలు పటిష్టంగా ఉన్నచోట కుటుంబసభ్యుల మద్య ఐక్యతా భావం పరస్పర ప్రేమభావం ఉన్నచోట భగవతత్వం నర్తిస్తూ ఉంటుంది.

నేడెన్ని కుటుంబాల్లో చక్కని అనుబంధాలు బాంధవ్యాలు సంతోషప్రదంగా పరిఢవిల్లుతున్నాయి?

మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ ఈ కనీస ధర్మాలనైనా పాటిస్తున్నామా? కనిపించే కనిపెంచే దైవాలను దర్శిస్తూ కూడా ఉపేక్షించడం లేదా?

మానవుడు తన్నుతానెరిగితే తత్వజ్ఞుడూ, ఆత్మజ్ఞుడు అవుతాడు. చూసే శక్తీ చూడాలన్న ఆసక్తి న అంతర్చక్షువుల కంటే సర్వత్రా సర్వదా దేవదర్శనం సులభమే.

అద్దంలో చూసుకుంటే మనకు మనమే సుందరులమని పొంగిపోయే అజ్ఞాతిమిరంలో ఉన్నన్నాల్లు దైవదర్శనప్రాప్తి దుర్లభమే. మనిషిలోని మంచిగుణాలే దైవత్వానికి ప్రతీకలు. అందుకే దైవం మానుషరూపేణ అన్నారు.

అంతశ్శుద్ధి ఉన్నచోటనే ఆత్మపరమాత్మ విరాజుల్లుతుందని వేదాలు ప్రవచిస్తున్నాయి. నిర్మలమైన ధ్యానంలో మౌనంలో భగవద్గానంలో పరమేశ్వరుణ్ణి తప్పక దర్శించగలుగుతాం.

శ్రమలేని నింతర శ్రమలో ఏకాగ్రతతలో నిశ్చలత్వంలో దైవం దివ్యతేజస్సుతో వెలుగొందుతూ గోచరిస్తున్నాడు.

ఇన్ని అవకాశాలు పొందిన మనోనేత్రాలతో ఆ సర్వాంతర్యామిని దర్శించుకోగలగడం మానవజన్మకు ప్రాప్తించిన మహావరం. దీన్ని సద్వినియోగం చేసుకోవడం మన చేతుల్లోను, చేతల్లోనే ఉంది.

  • ఉలాపు బాలకేశవులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/