భవానీపూర్ ఉప ఎన్నికలో మమతా బెనర్జీ ఘనవిజయం

యావత్తు దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పశ్చిమ్ బెంగాల్‌లోని భవానీపూర్ అసెంబ్లీ ఉప-ఎన్నిక ఫలితం వచ్చేసింది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి ప్రియాంక టిబ్రివాల్​పై 58,389 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఏడాది మార్చి- ఏప్రిల్‌లో జరిగిన పశ్చిమ్ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అఖండ విజయం సాధించినా.. ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం నందిగ్రామ్‌లో ఓటమి చవిచూశారు. ఈ నేపథ్యంలో ఉప-ఎన్నికల్లో దీదీ తప్పక గెలవాల్సి పరిస్థితి నెలకుంది.

భవానీపూర్‌లో గెలిస్తేనే ఆమె సీఎం పదవిలో కొనసాగుతారు. లేకపోతే, రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుంది. అయితే, తమ అధినేత్రి 50వేలకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారని టీఎంసీ నేతలు ధీమా వ్యక్తం చేసారు. వారు వ్యక్తం చేసినట్లే ప్రియాంక టిబ్రివాల్​పై 58,389 ఓట్ల తేడాతో మమతా విజయ ఢంకా మోగించింది. ఈ విజయం తో టీఎంసీ లో పండగ వాతావరణం నెలకొంది. నేతలు , కార్య కర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మొదటి రౌంగ్ నుండి కూడా మమతా జోరు చూపించింది.