గంగూలీ బెంగాల్ ముద్దు బిడ్డ అన్న మమతా బెనర్జీ

అవన్నీ పుకార్లే.. ఖండించిన మాజీ కెప్టెన్

Ganguly-Mamata Banerjee
Ganguly-Mamata Banerjee

బెంగళూరు: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రాజకీయాల్లో చేరుతారన్న వార్తలు ఇటీవల ఊపందుకున్నాయి. బీసీసీఐ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గంగూలీ ఈ నెల 23న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఊహగానాలు ఊపందుకున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి ముందు గంగూలీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. దీంతో గంగూలీ రాజకీయాల్లోకి రావడానికే ఆయనతో భేటీ అయ్యారన్న వార్తలు వెలువడ్డాయి. అంతేకాక, బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో, దీని వెనుక అమిత్ షా తోడ్పాటు ఉందన్న వాదనలకు బలం చేకూరింది.

మరోవైపు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గంగూలీకి బీసీసీఐ అధ్యక్ష పదవి దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. గంగూలీ బెంగాల్ ముద్దు బిడ్డ అని ప్రశంసించారు. మదర్ థెరిస్సా, అమర్త్యసేన్, అభిజిత్ బెనర్జీలు నోబెల్ బహుమతులు అందుకుని బెంగాల్ ప్రజలు గర్వపడేలా చేశారన్నారు. తాజాగా గంగూలీ కూడా ఉన్నత పదవులను అందుకుంటూ వారి సరసన చేరారని మమత మెచ్చుకున్నారు.తాను రాజకీయాల్లోకి వస్తున్నాననే వార్తలపై గంగూలీ స్పందిస్తూ అవి వట్టి పుకార్లేనన్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంలో ఎవరి ప్రమేయం, తోడ్పాటు లేదని స్పష్టం చేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు అమిత్ షాను కలిశానన్నారు. మా సంభాషణల్లో బీసీసీఐ అధ్యక్ష పదవికి సంబంధించిన అంశం చోటుచేసుకోలేదన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/