ఐటీ రైడ్స్ కేసులో మొదటిరోజు మంత్రి మల్లారెడ్డి విచారణ పూర్తి

ఐటీ రైడ్స్ కేసులో మొదటి రోజు మంత్రి మల్లారెడ్డి విచారణ పూర్తయింది. ఈరోజు మొత్తం 12 మందిని ఐటీశాఖ అధికారులు విచారించారు. రేపు (29న) ఉదయం 10 గంటలకు మరి కొంతమందిని కూడా విచారించనున్నారు. ప్రవీణ్ రెడ్డి, మహేందర్ రెడ్డికి నోటీసులు జారీ చేసి, రేపు విచారణకు పిలువనున్నారు. మహేందర్ రెడ్డికి ఈరోజు రమ్మని చెప్పి నోటీసు మాత్రం ఇవ్వలేదు. ఐటీ అధికారుల విచారణ పూర్తి కాగానే మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి తిరిగి ఇంటికి వెళ్లారు.

విచారణ అనంతరం మల్లా రెడ్డి కుమారుడు మీడియాతో మాట్లాడారు. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ తాము సమాధానాలు ఇచ్చామన్నారు. తనతోపాటు కళాశాలల ప్రిన్సిపాల్ మరికొంత మా సిబ్బందిని అధికారులు విచారించారని చెప్పారు. తమతో పాటు తమ కళాశాల సిబ్బంది స్టేట్మెంట్లను అధికారులు రికార్డు చేశారని చెప్పారు.

అవసరమనుకుంటే మరోసారి విచారణకు పిలుస్తామని తెలిపారు. ఇంజినీరింగ్ ,మెడికల్ కళాశాలల ఫీజుల వివరాలు సీట్ల కేటాయింపు వివరాలను సమర్పించాలని అధికారులు కోరారని వెల్లడించారు. ఐటి అధికారులు ఇచ్చిన ఫార్మేట్ లోనే వివరాలు ఇవ్వాలని కోరారన్నారు. అధికారులు అడిగిన ఫార్మట్‌లోనే పూర్తి వివరాలు ఇచ్చేందుకు తాము రెడీగా ఉన్నామన్నారు. తాము చెప్పిన సమాధానాలతో అధికారులు సంతృప్తి చెందారని అనుకుంటున్నట్టు వివరించారు. ప్రవీణ్ రెడ్డి, మల్లారెడ్డి మహేందర్ రెడ్డికి ఇంకా సమన్లు రాలేదన్నారు. ఐటీ అధికారుల విచారణకు తాము అన్ని విధాల సహకరిస్తామన్నారు.