బీజేపీలో చేరబోతున్న తీన్మార్ మల్లన్న ..?

క్యూ న్యూస్ చీఫ్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీ లో చేరబోతున్నట్లు తెలుస్తుంది. మోడీ విధానాలు నచ్చి మల్లన్న బిజెపిలోకి చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలు కేసులు ఎదుర్కొంటూ జైలుకెళ్లిన తీన్మార్ మల్లన్నని విడుదల చేయించేందుకు ఆయన భార్య మమత ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డాకి లేఖలు రాయడం సంచలనంగా మారింది.

జోతిష్యుడిని బెదిరించిన కేసులో జైలుపాలైన తీన్మార్ మల్లన్న బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ వెంటనే మరో కేసులో ఆయనను రిమాండ్‌కి పంపించారు. మల్లన్న జైలుకెళ్లి ఇప్పటికి 34 రోజులు అవుతోంది. ఆయన్ను విడిపించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని.. ఢిల్లీ పెద్దల ఆశీస్సులతో బయటపడే అవకాశాలున్నాయని తెలుస్తుంది. జైలు నుంచి విడుదలయ్యాక మల్లన్న బీజేపీలో చేరే అవకాశం ఉంది. వాస్తవానికి తీన్మార్ మల్లన్న ముందు నుండి బీజేపీ మనిషి అనే విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. అన్ని పార్టీల నేతలను,విధానాలఫై విమర్శలు చేసే మల్లన్న..బీజేపీ విధానాల పట్ల మాత్రం పెద్దగా విమర్శలు చేసిన దాఖలా లేదు. మల్లన్న కేసులు ఎదుర్కొన్న ప్రతీసారి అందరికన్నా బీజేపీ నేతలే ఆయనకు ఎక్కువ అండగా నిలబడుతూ వచ్చారు. మల్లన్న తరుపున ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడం చూసాం. ప్రస్తుతం కూడా మల్లన్న బీజేపీ లో చేరితేనే బయట పడే ఛాన్స్ ఉన్నట్లు భావించారు. అందుకే ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.