క్రిస్మస్‌ కేక్‌లు – వెరైటీ రుచులు:

క్రిస్మస్‌ పండగ వచ్చేస్తోంది. ఏరకమైన కేక్‌లు తయారుచేద్దామా అని తల్లులు, ఎన్ని కేక్‌లు రుచి చూద్దామా అని పిల్లలు ఆలోచనల్లో ఉంటారు. మీ పండగ పసందుగా జరగాలంటే రకరకాల కేక్‌ల తయారీ మీకు తెలియాల్సిందే. కాస్త ఓపిక, సమయం ఉంటే చాలు రుచికరమైన కేకులను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

క్యారెట్‌ కేక్‌

కావలసినవి: మైదా-225గ్రా., వంటసోడా-ఏడు గ్రా.
పంచదార-325గ్రా., దాల్చినచెక్క-రెండు గ్రా.
కోడిగుడ్లు-నాలుగు, నూనె-235గ్రా. వాల్‌నట్లు-120గ్రా.
క్యారెట్లు-250గ్రా, చీజ్‌ ఐసింగ్‌ కోసం
తయారుచేసే విధానం: చీజ్‌-200గ్రా, ఐసింగ్‌ షుగర్‌, గిలక్కొట్టిన క్రీం -100గ్రా చొప్పున, నిమ్మకాయ పొట్టు-కొద్దిగా
కేక్‌ తయారీ:
వెడల్పాటి గిన్నెలో నూనె పంచదార, కోడిగుడ్ల సొన తీసుకుని నురగ వచ్చేదాకా బాగా గిలక్కొట్టాలి. ఇప్పుడు క్యారెట్‌ తప్ప మిగిలిన పదార్థాలన్నీ అందులో వేసి బాగా కలపాలి. చివరగా తురిమిన క్యారెట్‌ చేర్చాలి. ఈ మిశ్రమాన్ని టిష్యూ పరిచిన ఓవెన్‌ పాత్రలోకి తీసుకుని 170డిగ్రీల ఉష్ణోగ్రతలో అరగంట సేపు బేక్‌ చేయాలి. ఆ తరువాత బయటకు తీసి మరికాసేపు ఫ్రిజ్‌లో ఉంచి కేక్‌ముక్కల్లా కోస్తే చాలు. కమ్మని క్యారెట్‌ కేక్‌ సిద్ధం.

ఐసింగ్‌ తయారీ: పైన పేర్కొన్న పదార్థాలన్నింటినీ బాగా కలిపితే ఐసింగ్‌ తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని కేక్‌పై పూతలా రాయాలి.
పైనాపిల్‌ అప్‌సైడ్‌ కేక్‌
కావలసినవి: బ్రౌన్‌షుగర్‌(ముడి పంచదార)-పావ్ఞ కప్పు
మైదా-ఒకటిన్నర కప్పులు, బేకింగ్‌ పౌడర్‌-టీస్పూన్‌
బేకింగ్‌సోడా-టీస్పూన్‌, తేనె-ముప్పావ్ఞకప్పు
చీజ్‌-ముప్పావు కప్పు, పైనాపిల్‌జ్యూస్‌-పావ్ఞ కప్పు
వెనీలా ఎసెన్స్‌-టేబుల్‌ స్పూన్‌, నెయ్యి-ముప్పావ్ఞ కప్పు
నిమ్మరసం-2టేబుల్‌స్పూన్లు, ఆరెంజ్‌
తొక్కల తురుము-టీస్పూన్‌పైనాపిల్‌ ముక్కలు-20

తయారుచేసే విధానం: ఓవెన్‌ను ముందుగానే 180 డిగ్రీల దగ్గర వేడిచేసి ఉంచుకోవాలి. కేకు టిన్నుకి నెయ్యి రాసి బ్రౌన్‌ షుగర్‌ చల్లాలి. ఓ గిన్నెలో మైదా, బేకింగ్‌ పౌడర్‌, బేకింగ్‌ సోడా, ఉప్పు వేసి కలపాలి. మరో గిన్నెలో నెయ్యి, తేనె, చీజ్‌, పైనాపిల్‌ జ్యూస్‌, వెనీలాఎసెన్స్‌, నిమ్మరసం, ఆరెంజ్‌తొక్కల తురుము వేసి గిలకొట్టాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మైదా మిశ్రమంలో వేసి బాగా కలపాలి. కేకు టిన్నులో అడుగున పైనాపిల్‌ ముక్కలు పేర్చాలి. దానిమీద జాగ్రత్తగా కేకు మిశ్రమాన్ని వేసి సుమారు 25 నుంచి 30 నిమిషాలు బేక్‌ చేయాలి. కేకు గోధుమరంగులోకి మారాక బయటకు తీసి అరగంట సేపు చల్లారనివ్వాలి. తరువాత జాగ్రత్తగా టిన్నును ప్లేటులోకి బోర్లించి ముక్కలుగా కోసి అందించాలి.

బాదం కేక్‌
కావలసినవి:
బాదం- ఒక కప్పు, మొక్కజొన్నపిండి-అరకప్పు
మైదా-అరకప్పు, వంటసోడా-చెంచా, వెన్న-వంద గ్రా, పంచదార-పొడి కప్పున్నర, వెనిల్లా ఎసెన్సు-అరచెంచా, గుడ్లసొన-రెండు కప్పులు (ఆరుగుడ్లు), క్రీం-పావు కప్పు

తయారుచేసే విధానం: బాదంను ముందురోజు నానబెట్టి మర్నాడు మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. ఒక పాత్రకు కొద్దిగా వెన్నరాసి పైన రెండుచెంచాల మైదా చల్లి పక్కన పెట్టుకోవాలి. మొక్కజొన్న పిండిలో మిగిలిన మైదా, వంటసోడా కలిపి ఉంచుకోవాలి. బాదం ముద్దలో వెన్న వేసి బాగా కలియతిప్పాలి. వెన్న రాసి పక్కన పెట్టిన పాత్రలో వేసి బేక్‌ చేయాలి. అరగంటయ్యాక బయటకు తీసి పంచదార పొడి చల్లితే బాదం కేక్‌సిద్ధ మయినట్టే.