ఎట్టకేలకు మహేష్‌ను లైన్‌లో పెట్టిన త్రివిక్రమ్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో ‘సర్కారు వారి పాట’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నా, కరోనా కారణంగా వరుసగా వాయిదా పడుతూ వస్తోంది. ఆర్థికనేరాల బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్‌లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమా తరువాత మహేష్ తన నెక్ట్స్ చిత్రాన్ని తాజాగా అనౌన్స్ చేశాడు.

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌తో మహేష్ తన 28వ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ సినిమాతో త్రివిక్రమ్-మహేష్ కాంబో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో అతడు, ఖలేజా వంటి చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా, టీవీ ప్రేక్షకులను మాత్రం ఇంకా అలరిస్తూ వస్తున్నాయి. ఈ రెండు చిత్రాలకు ధీటుగా ఈసారి అదిరిపోయే సినిమాతో ప్రేక్షకులను మెప్పించాలని మహేష్ భావిస్తున్నాడు.

ఇక ఈ సినిమాను అతి త్వరలో ప్రారంభించి, 2022 సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా ఉండిపోయింది.